బుట్టాయగూడెం: గిరిజన ప్రాంతంలో కలప అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ప్రస్తుతం వర్జీనియా పొగాకు క్యూరింగ్ పనులు ప్రారంభం కావడంతో పొగాకు బేరన్‌లకు అడవిలోని కలపను నరికి యథేచ్ఛగా తరలిస్తున్నారు. గత కొద్ది రోజులుగా బుట్టాయగూడెం మండలంలోని పాలకుంట, రెడ్డిగణపవరం గ్రామాల నుంచి పట్టపగలే ట్రాక్టర్‌లలో కలపను తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
భీమవరం: స్థానిక ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈనెల 19వ తేదీ నుంచి మూడు రోజులపాటు జాతీయస్థాయిలో అండర్–23 మెన్ అండ్ ఉమెన్ ఓపెన్ బాక్సింగ్ చాంపియన్ షిప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఏపీ అమెచ్యూర్ బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ బుధవారం వెల్లడించారు. సాగి రామకృష్ణంరాజు ట్రోఫీ 2026 పేరిట నిర్వహిస్తున్న ఈ పోటీలను ఇండియన్ అమెచ్యూర్ బాక్సింగ్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ ఆమెచుర్ బాక్సింగ్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. 20 రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పేర్లు నమోదు చేయించుకున్నారని తెలిపారు.
నూజివీడు: ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్న ఘటన బుధవారం పట్టణంలోని విస్సన్నపేట రోడ్డులో పెట్రోలు బంకు సమీపంలో జరిగింది. అదృష్టవశాత్తూ ప్రయాణికులకు ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తిరువూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు తిరువూరు నుంచి నూజివీడు వస్తుండగా మధ్యాహ్నం 3 గంటల సమయంలో పట్టణంలోని పెంకు ఫ్యాక్టరీ సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. బస్సును ఢీకొనగానే వచ్చిన శబ్దానికి ప్రయాణికులు భీతిల్లారు. ఒక మహిళకు స్వల్ప గాయం కాగా మిగతావారికి ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ప్రభుత్వ పాఠశాలల్లో బ్రిడ్జి కోర్సు బోధించే ఉపాధ్యాయులను పదో తరగతి పరీక్షలకు ఇన్విజిలేటర్లుగా నియమించడం, డీఈఓ కార్యాలయంలో బాధ్యతలు అప్పగించడం వల్ల తరగతులు సక్రమంగా జరగక విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఉపాధ్యాయులను వెంటనే పాఠశాలలకు పంపించి విద్యార్థులకు బ్రిడ్జి కోర్సులు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
ఏలూరు రూరల్: ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియం ఆవరణలో ఈ నెల 24వ తేదీన అథ్లెటిక్స్ జిల్లా జట్ల ఎంపిక చేపట్టనున్నట్లు డీఎస్‌డీఓ ఎస్‌ఏ అజీజ్ ఓ ప్రకటనలో తెలిపారు. 35, 45 ఏళ్ల వయస్సు పైబడిన విభాగంలో 100, 400, 800, 1500 మీటర్ల పరుగు పందెంతో పాటు లాంగ్‌జంప్, షాట్‌పుట్, హైజంప్, జావలిన్‌త్రో, 4 ఇన్‌టూ 100 రిలే పోటీలు జరగనున్నాయని పేర్కొన్నారు. ఇందులో ఎంపికై నవారు ఈనెల 30, 31 తేదీల్లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆవరణలో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంటారని వివరించారు. ఆసక్తి గల ఏలూరు జిల్లా క్రీడాకారులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ క్రీడల స్పోర్ట్స్ వెబ్‌సైట్‌లో ఆధార్‌కార్డు ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. వివరాలకు షేక్ ఖాసిం 9492701324 నంబర్‌లో సంప్రదించాలన్నారు.
ఆగిరిపల్లి: ఆగిరిపల్లిలో పురుగుమందుల దుకాణాలపై బుధవారం జిల్లా వ్యవసాయ అధికారి హబీబ్ బాషా ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రెండు దుకాణాలను తనిఖీ చేసి పురుగు మందుల నమూనాలను సేకరించారు. ఆయన మాట్లాడుతూ దుకాణాల యజమానులు ప్రభుత్వ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగానే పురుగు మందులను విక్రయించాలన్నారు. పురుగు మందులు కొనుగోలు చేసే ప్రతి రైతుకు తప్పనిసరిగా రసీదు ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం అమ్మవారి గూడెంలో రైతన్న మీకోసం సర్వేను పరిశీలించి సిబ్బందికి పలు సూచన చేశారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి జె. భవాని, రైతు సేవ కేంద్రం సిబ్బంది అపర్ణ, సూర్య కౌషిక్, సాయి పాల్గొన్నారు.


