సాక్షిప్రతినిధి, వరంగల్: వరుణుడు కరుణించలేదు. చెరువులు, ప్రాజెక్టులు నిండలేదు. బోర్లలో నీరు నిలవలేదు. వెరసి యాసంగి సాగుపై కరువు మేఘాలు కమ్ముకుంటున్నాయి. వానాకాలం పంట చేతికొచ్చేలోపే యాసంగి సాగుకు నీటి కష్టాలు మొదలయ్యాయి. నిన్నటి వరకు పంటలతో కళకళలాడిన పొలాలను చూసి సంబురపడిన రైతులు.. నేడు తదుపరి పంట వేయాలా? వద్దా? అన్న సందిగ్ధంలో ఉండిపోయారు. ఉమ్మడి వరంగల్‌లోని ఆరు జిల్లాల్లో వ్యవసాయ శాఖ తాజా గణాంకాలు ఇదే పరిస్థితిని కళ్లకు కడుతున్నాయి. గతేడాది ఇదే సమయానికి 22,902 ఎకరాల్లో పంటలు వేయగా.. ఈసారి ఐదో వంతు కూడా నమోదు కాలేదు. మరోవైపు నాలుగు జిల్లాల్లో తీవ్ర వర్షాభావం, 6 జిల్లాల్లో భూగర్భ జలాలు అడుగంటడం, ప్రధాన ప్రాజెక్టుల్లో తగ్గిన నీటి నిల్వలు రైతులను కలవరపెడుతున్నాయి.
లక్ష్యం కొండంత.. ఆచరణ గోరంత
ఉమ్మడి వరంగల్‌లో యాసంగి సాధారణ సాగు విస్తీర్ణం 9,95,120 ఎకరాలుగా వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈనెల 23 నాటికి 6 జిల్లాల్లో కలిపి సాగైన విస్తీర్ణం కేవలం 4,347 ఎకరాలే. అంటే లక్ష్యంలో 0.44 శాతమే సాగులోకి వచ్చింది. జిల్లాల వారీగా చూస్తే హనుమకొండలో అత్యధికంగా 2,096 ఎకరాల్లో సాగు నమోదైనా.. సాధారణ విస్తీర్ణంతో పోలిస్తే అది 1.05 శాతమే. జనగామలో 900, మహబూబాబాద్‌లో 765, వరంగల్‌లో 528, భూపాలపల్లిలో 58 ఎకరాల్లో మాత్రమే విత్తనాలు వేశారు. ములుగు జిల్లాలో ఇప్పటివరకు ఒక్క ఎకరంలోనూ సాగు ప్రారంభం కాలేదు.
వరి నాట్లకు జల గండం..
ఆరు జిల్లాల్లో కలిపి 6,78,203 ఎకరాల్లో వరి సాగవుతుందని అంచనా వేయగా.. ఇప్పటివరకు ఒక్క ఎకరంలోనూ నాట్లు పడలేదు. వరి తర్వాత అత్యధికంగా సాగయ్యే మొక్కజొన్న సాధారణ విస్తీర్ణం 2,85,326 ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 1,929 ఎకరాల్లో మాత్రమే విత్తనాలు పడ్డాయి. వేరుశనగ సాధారణ విస్తీర్ణం 4,553 ఎకరాలకు 1,287 ఎకరాల్లో సాగైంది. హనుమకొండలో 500 ఎకరాల్లో మొక్కజొన్న, 77 ఎకరాల్లో శనగ, 99 ఎకరాల్లో పెసర సాగు ప్రారంభమైంది. గతేడాది అక్టోబర్‌తో పోలిస్తే 6 జిల్లాల్లోనూ నీటిమట్టాలు గణనీయంగా పడిపోయాయి. భూపాలపల్లిలో భూగర్భ జలాలు ఏకంగా 10.74 మీటర్ల లోతుకు చేరడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.
వర్షాభావం.. కరువుకు సంకేతం
జూన్ 1 నుంచి ఈ నెల 24 వరకు నమోదైన వర్షపాతం గణాంకాలు కూడా ఆందోళనకరంగానే ఉన్నాయి. నైరుతి రుతుపవనాల సమయంలోనే ఆశించిన వర్షాలు కురవకపోగా.. ఈశాన్య రుతుపవనాలు సైతం మొండిచేయి చూపాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో గతేడాది ఇదే సమయానికి 80.50 టీఎంసీల నీరు ఉండగా.. ప్రస్తుతం 33.68 టీఎంసీలకు పడిపోయింది. లోయర్ మానేరు డ్యాంలో 23.95 టీఎంసీల నుంచి 14.92 టీఎంసీలకు తగ్గింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే యాసంగి సాధారణ సాగు లక్ష్యంలో భారీ కోత పడే అవకాశముంది.
నీటి కోసం రైతుల ఎదురుచూపు
ఉమ్మడి జిల్లాలో 9.95 లక్షల ఎకరాల సాగు లక్ష్యం
ఇప్పటివరకు పడిన విత్తనాలు 4,347 ఎకరాల్లోనే!
గతేడాదితో పోలిస్తే ఐదో వంతుకూ చేరని పరిస్థితి
నాలుగు జిల్లాల్లో తీవ్ర వర్షాభావం
ఎస్సారెస్పీలో ప్రస్తుతం 33.68 టీఎంసీలే


