కొత్త పింఛన్లొస్తున్నాయి | - | Sakshi
Sakshi News home page

కొత్త పింఛన్లొస్తున్నాయి

Nov 12 2026 5:24 AM | Updated on Nov 12 2026 5:24 AM

సాక్షి, వరంగల్‌: కొత్త పింఛన్ల కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరుపేదలకు ఎట్టకేలకు చేయూత అందనుంది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన ఆసరా పింఛన్లను బుధవారం నుంచి లబ్ధిదారులకు పంపిణీ చేయనుంది. ఇందుకోసం అధికార జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 12 నుంచి 18వ తేదీ వరకు మున్సిపాలిటీలు, మండల కేంద్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా పింఛన్ల మంజూరు పత్రాలు అందించనున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రితోపాటు జిల్లాకు చెందిన ఇన్‌న్‌చార్జ్‌ మంత్రి సైతం ఈ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

క్షేత్రస్థాయిలో అధికారుల పరిశీలన..

జిల్లాలో కొత్త పింఛన్ల కోసం మొత్తం 14,506 మంది దరఖాస్తు చేసుకున్నారు. వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ, ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికుల నుంచి వచ్చిన దరఖాస్తులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హతలను నిర్ధారించారు. వెరిఫికేషన్‌ ప్రక్రియలో 13,334 మందిని అర్హులుగా గుర్తించగా, 1,155 దరఖాస్తులను అనర్హమైనవిగా తేల్చారు. మరో 17 దరఖాస్తులు హోల్డ్‌లో పెట్టారు. మొత్తం దరఖాస్తులకు వెరిఫికేషన్‌ ప్రక్రియ పూర్తయ్యింది. ఎంపీడీఓ స్థాయిలో 12,293 దరఖాస్తులకు ఆమోదం లభించగా.. 1,346 తిరస్కరణకు గురయ్యాయి. మరో 850 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. డిపార్ట్‌మెంట్ల పరిశీలనలో 402 కేసులు పెండింగ్‌ లేదా తిరస్కరణకు సంబంధించినవిగా నమోదయ్యాయి. అనంతరం జిల్లా స్థాయి తుది పరిశీలనలో 11,862 దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోగా...11,656 మందికి ఆమోదం లభించింది. మరో 206 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా.. 840 దరఖాస్తులు రివర్ట్‌ అయ్యాయి. అదనపు పత్రాలతో పాటు విచారించి పంపమని కిందిస్థాయి అధికారికి మళ్లీ ఉన్నతాధికారులు వెనక్కి పంపారు.

జీడబ్ల్యూఎంసీ పరిధిలోనే అధికం..

మండలాల వారీగా పరిశీలిస్తే జీడబ్ల్యూఎంసీ పరిధిలో అత్యధికంగా 4,654 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 4,140 మందిని అర్హులుగా గుర్తించారు. తుది స్థాయిలో 3,747 దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోగా, 3,641 మందికి ఆమోదం లభించింది. 652 తిరస్కరణకు గురికాగా, 160 రివర్ట్‌ అయినవి (వెనక్కి పంపినవి), 106 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే, నర్సంపేట మున్సిపాలిటీలో 980 దరఖాస్తులకు 785 మందికి, వర్ధన్నపేట మున్సిపాలిటీలో 231 దరఖాస్తులకు 202 ఆమోదం పొందాయి. ఈ రెండు మున్సిపాలిటీల్లో 76 దరఖాస్తులు రివర్ట్‌ కాగా.. 127 మంది దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి.

వారం రోజుల పాటు పంపిణీ..

కొత్త పింఛన్ల మంజూరుతో లబ్ధిదారులకు నెలవారీ ఆర్థిక భరోసా లభించనుంది. ముఖ్యంగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర అర్హులైన వర్గాలకు ఈ సాయం ఊరటనివ్వనుంది. నియోజకవర్గాల వారీగా ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో పింఛన్‌ మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. లబ్ధిదారులకు ముందస్తు సమాచారం అందించడం, కార్యక్రమాలకు అవసరమైన ఏర్పాట్లు చేయడం, మంజూరు పత్రాల పంపిణీ వంటి బాధ్యతలను సంబంధిత శాఖలకు అప్పగించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సంవత్సరాలుగా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న తమకు కొంత ఆర్థిక వెసులుబాటు కల్పించిందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

నేటి నుంచి లబ్ధిదారులకు మంజూరుపత్రాల పంపిణీ

14,506 దరఖాస్తులకు 11,656 తుది ఆమోదం

మరో 206 అర్జీలు పెండింగ్‌.. 840 మళ్లీ పరిశీలన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement