ఖానాపురం: నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు, ప్రభుత్వ పెద్దల సూచనలు.. ఎల్‌నినో పరిస్థితుల కారణంగా పాకాల ఆయకట్టు కింద అసంపూర్తిగానే వరి పంట సాగు.. కానీ, పాకాల సరస్సులో ఉన్న నీరంతా వాగు పాలు అవుతోంది.. అయినా పట్టించుకునే అధికారులే కరువయ్యారని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖానాపురం మండలంలో ప్రధాన నీటివనరు పాకాల సరస్సు నీటిసామర్థ్యం 30.3 ఫీట్లు. ప్రస్తుతం సరస్సులో 20.09 ఫీట్ల నీటిమట్టం ఉంది. ఆయకట్టు పరిధిలో పంటలు చివరి దశకు చేరాయి. పంటల సాగు పూర్తయితే తాగునీటికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఎల్‌నినోతో నీటి సమస్యలు తెలెత్తే అవకాశాలు ఉన్నాయని, నీటిని పొదుపుగా వాడుకోవాలని రాష్ట్ర, జిల్లాస్థాయి అధికారులు ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నారు. కానీ, పాకాల సరస్సు పాకాల వాగు ద్వారా సుమారు 15 రోజులుగా వృథాగా పోతోందని ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటివృథాను అరికట్టడంలో ఇరిగేషన్ అధికారులు విఫలమవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి పాకాల నీటిని వృథాను అరికట్టాలని రైతులు కోరుతున్నారు.
వాగులోకి పోతున్నా పట్టించుకోని నీటిపారుదలశాఖ అధికారులు
ఆందోళన చెందుతున్న
సరస్సు ఆయకట్టు రైతులు
సరస్సులో ప్రస్తుతం
20.09 ఫీట్ల నీటిమట్టం


