నర్సంపేట రూరల్: డ్రగ్స్ వ్యవస్థ విముక్తి కేంద్రాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకురావాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత అన్నారు. నర్సంపేటలోని ప్రభుత్వ వైద్య కళాశాల, జనరల్ ఆస్పత్రిని బుధవారం ఆమె సందర్శించారు. ఆస్పత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాలను వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నర్సంపేట పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సంధ్యారాణి, సూపరింటెండెంట్ దామోదరబాయి, నర్సంపేట ఏసీపీ రవీందర్‌రెడ్డి, సీఐ ముస్కు శ్రీనివాస్, ఎస్సై తదితరులు పాల్గొన్నారు.
హన్మకొండ : విద్యుత్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అరేపల్లి మోహన్, జనరల్ సెక్రటరీ మక్క దానయ్య కోరారు. బుధవారం హనుమకొండ వచ్చిన డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కను అసోసియేషన్ నాయకులు కలిశారు. విద్యుత్ సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించిన మెరిట్ కమ్ సీనియారిటీ విధానంలో తలెత్తుతున్న సమస్యలు వివరించి వినతి పత్రం అందజేశారు. సమస్యను విన్న ఉప ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని బక్క దానయ్య తెలిపారు.
కాశిబుగ్గ : వరంగల్‌లోని దేశాయిపేటకు చెందిన అరవింద్ నాగనబోయినకు లండన్ పార్లమెంట్‌లో పాల్గొనే అవకాశం దక్కింది. బ్రిటన్ పార్లమెంట్ వెస్ట్ మినిస్టర్‌లో జరిగిన ఫారిన్ పాలసీ సెంటర్‌కు హాజరై ప్రత్యేక గుర్తింపు పొందారు.అంతర్జాతీయ సంబంధాలు, విదేశాంగ విధానం, ప్రపంచ రాజకీయ పరిణామాలపై జరిగిన చర్చలో వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాల్సిన అవసరంపై అరవింద్ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. లండన్‌లో మాస్టర్స్ చదివేందుకు వెళ్లిన అరవింద్‌కు మన దేశానికి ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కావాలని విన్నవించే అవకాశం రావడం సంతోషంగా ఉందని వరంగల్‌కు చెందిన మిత్రులు తెలిపారు.
భూముల రీసర్వే పకడ్బందీగా నిర్వహించాలి
న్యూశాయంపేట: భూముల రీసర్వే ప్రక్రియను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్ సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో భూ రీసర్వేపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబర్ నెలాఖరుకు ప్రతిజిల్లాలో తొలి విడత లక్ష్యాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎల్.కిశోర్‌కుమార్, డీఆర్‌ఓ విజయలక్ష్మి, ఆర్డీఓలు సుమ, ఉమారాణి, అధికారులు పాల్గొన్నారు.
కేయూ 24వ స్నాతకోత్సవ కమిటీల నియామకం
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ 24వ స్నాతకోత్సవాన్ని ఈనెల 28న క్యాంపస్‌లోని ఆడిటోరియంలో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో స్నాతకోత్సవ నిర్వహణకు వివిధ కమిటీలను నియమిస్తూ కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్రం బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. స్టీరింగ్ కమిటీ చైర్మన్‌గా ప్రొఫెసర్ పి.మల్లారెడ్డి, సభ్యులుగా ప్రొఫెసర్లు టి.మనోహర్, పి.వరలక్ష్మి, వై.వెంకయ్య ఉన్నారు. కన్వీనర్‌గా పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కె.రాజేందర్ వ్యవహరించనున్నారు. వీరితో పాటు వివిధ కమిటీలు ఏర్పాటు చేసి కన్వీనర్లను, కోకన్వీనర్లును నియమించారు. స్నాతకోత్సవాన్ని విజయవంతం చేయడమే కమిటీల ప్రధాన లక్ష్యమని రిజిస్ట్రార్ రామచంద్రం పేర్కొన్నారు.


