సాక్షి, వరంగల్: రుచికరమైన ఆహారం తింటున్నామనుకుంటున్నారా? మీకు తెలియకుండానే అనారోగ్యాన్ని కొనుక్కుంటున్నారా? అన్న అనుమానాలు ఇటీవల వరంగల్, హనుమకొండలో ఫుడ్‌సేఫ్టీ అధికారుల వరుస దాడులతో వ్యక్తమవుతున్నాయి. స్వీట్ల తయారీ కేంద్రాల నుంచి జ్యూస్ సెంటర్లు, బిర్యానీ హోటళ్ల వరకు ఎక్కడ చూసినా ఆహార భద్రతా ప్రమాణాల ఉల్లంఘనలు బయటపడుతున్నాయి. కుళ్లిన పండ్లు, బూజు పట్టిన చికెన్‌న్, పదేపదే వినియోగించిన నూనె, నిషేధిత సింథటిక్ రంగులు, అపరిశుభ్రమైన వంట గదులు.. ఇలా ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న వాస్తవాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా వరంగల్‌లోని బిర్యానీ హోటళ్లలో గుర్తించిన ఉల్లంఘనలు నగరవాసులను టెన్షన్‌కు గురి చేస్తున్నాయి.
తినే ముందు ఆలోచించాలి..
గ్రేటర్ వరంగల్‌లో వరుస ఘటనలు ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయి. ఆకర్షణీయమైన రంగుల్లో కనిపించే బిర్యానీ, స్వీట్లు నాణ్యమైనవేనని భావించకూడదు. అసహజమైన రంగు, వాసన, రుచి ఉన్న ఆహారాన్ని తీసుకోకూడదు. హోటళ్లలో వంటగది పరిశుభ్రత, ఆహార నిల్వ విధానం, వంటనూనె నాణ్యతను గమనించాలి. ప్యాక్ చేసిన పదార్థాలపై తయారీ తేదీ, గడువు తేదీ, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్సు వివరాలు పరిశీలించాలి. అనుమానం వచ్చినప్పుడు బిల్లు తీసుకొని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని ఫుడ్‌సేఫ్టీ సీనియర్ ఆఫీసర్ కృష్ణమూర్తి సూచిస్తున్నారు.
గ్రేటర్ వరంగల్‌లో ఆహార భద్రతా ప్రమాణాలకు పాతర
స్వీట్ల తయారీ కేంద్రాల నుంచి బిర్యానీ హోటళ్ల వరకు ఇదే తీరు
కుళ్లిన పండ్లు, బూజుపట్టిన చికెన్, నిషేధిత రసాయన రంగులు విచ్చలవిడిగావినియోగం
ఫుడ్‌సేఫ్టీ అధికారుల వరుస దాడులతో వెలుగులోకి వస్తున్న ఘటనలు
నిరంతర పర్యవేక్షణ అవసరం
వరంగల్, హనుమకొండలో వెలుగుచూస్తున్న ఘటనలు ఆహార భద్రతా విభాగం నిరంతర పర్యవేక్షణ అవసరాన్ని స్పష్టం చేస్తున్నాయి. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లోనే కాకుండా సాధారణ రోజుల్లోనూ స్వీట్ షాపులు, బిర్యానీ హోటళ్లు, జ్యూస్ సెంటర్లు, బేకరీలు, ఫాస్ట్‌ఫుడ్ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలి. సేకరించిన నమూనాల ల్యాబ్ నివేదికలను త్వరగా తెప్పించి, కల్తీ నిర్ధారణ అయితే కఠిన చర్యలు తీసుకోవాలి. ఒకసారి దాడి చేసి వదిలేయకుండా తిరిగి తనిఖీలు నిర్వహించాలి. ప్రజారోగ్యంతో చెలగాటమాడే వ్యాపారులపై చర్యలు తీసుకుంటేనే పరిస్థితిలో మార్పు వస్తుందని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు.
కల్తీ ఆహారంతో అనారోగ్యం..
కల్తీ ఆహారం ఆహారం తీసుకున్న వెంటనే వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, జ్వరం, డీహైడ్రేషన్ వంటి సమస్యలు వస్తాయి. ఆహారంలో కలిపే కొన్ని హానికరమైన రసాయనాలు, కృత్రిమ రంగులు, విషపూరిత లోహాలు శరీరంలోకి చేరితే కాలేయం, మూత్రపిండాలు, నాడీ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. కొన్ని విషపదార్థాలతో క్యాన్సర్ ముప్పు కూడా ఉంటుంది. ముఖ్యంగా చిన్నారులు, గర్భిణులు, వృద్ధులపై వీటి ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. – సిరుప రఘు, జనరల్ ఫిజీషియన్, హనుమకొండ


