సీఎంఆర్ దందాలో..
పోలీసు, రెవెన్యూ, రాజకీయ నేతల కుటుంబాల పాత్ర
సాక్షి ప్రతినిధి, వరంగల్:
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రభుత్వ ధాన్యం పక్కదారి.. మిల్లర్ల ముసుగులో బినామీల వ్యాపారం.. సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) పేరుతో సాగుతున్న అక్రమాల్లో అసలు సూత్రధారులు ఎవరన్నది చర్చనీయాంశంగా మారింది. రైస్‌మిల్లుల యజమానులుగా కొందరు కనిపిస్తున్నా.. తెరవెనుక పోలీస్, రెవెన్యూ అధికారుల కుటుంబసభ్యులు, రాజకీయ నేతల బంధువుల పెట్టుబడులు ఉన్నాయన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. గీసుకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ పోలీస్ అధికారి కుటుంబ సభ్యులపై కేసు నమోదు కావడం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా డీఎస్‌ఓ వ్యవహారంపై ఎస్పీ నివేదిక పంపడం ఈ వ్యవహారానికి మరింత ప్రాధాన్యం తెచ్చాయి. మరోవైపు విజిలెన్స్, సీఐడీ దర్యాప్తుల్లో మిల్లర్ల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండడంతో.. ఈ దందా వెనుక ఉన్న బినామీలు, వారికి అండగా నిలిచిన అధికారుల పాత్రపైనా విచారణ జరగాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.
సీఎంఆర్ దందాలో అధికారుల బినామీలు?
సీఎంఆర్ అక్రమాలకు సంబంధించి గీసుకొండ పోలీస్‌స్టేషన్‌లో ఓ పోలీస్ అధికారి కుటుంబ సభ్యులపై కేసు నమోదు కావడం అప్పట్లో చర్చనీయాంశమైంది. స్టేషన్‌కు వెళ్లకుండా అంటిసిపేటరీ బెయిల్ (ముందస్తు బెయిల్) పొందినట్లు ప్రచారం ఉంది. ప్రభుత్వ ధాన్యం, బియ్యం లావాదేవీల్లో సంబంధిత మిల్లుతో వారికున్న సంబంధం ఏంటి? పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీల వెనుక ఎవరున్నారు? అని ఇప్పుడు సీఐడీ ఆరా తీస్తోంది.
జేఎస్ భూపాలపల్లి జిల్లాలో ఇద్దరు పోలీస్ అధికా రుల పెట్టుబడులు ఉన్నట్లు ప్రచారం జరిగింది.
హనుమకొండ, వరంగల్‌లో రెవెన్యూ, పౌరసరఫరాల శాఖకు చెందిన కొందరు అధికారుల కుటుంబసభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున సీఎంఆర్ ఎగవేతలో భాగస్వాములుగా ఉన్నారని సమాచారం.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సీఎంఆర్ వ్యవహారానికి సంబంధించి జిల్లా పౌరసరఫరాల అధికారి (డీఎస్‌ఓ) రాఘవేంద్రరావు పాత్రపై పోలీస్ శాఖ దృష్టి సారించింది. ఆయన హయాంలో జరిగిన అక్రమాల బాగోతంపై జిల్లా ఎస్పీ సంకీర్త్ సమర్పించిన నివేదిక కలకలం రేపుతోంది.
పాత బకాయిలు, కొత్త కేటాయింపులు.. బినామీల పెట్టుబడులపై ఆరా
సీఐడీ విచారణలో సీఎంఆర్ బకాయిలున్న మిల్లులకు తిరిగి ధాన్యం కేటాయింపులు జరిగాయన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పాత బకాయిలు చెల్లించని మిల్లులకు కొత్తగా ధాన్యం ఎలా కేటాయించారు? వాస్తవ నిల్వలు పరిశీలించకుండా సరఫరాలు చేశారా? తనిఖీల్లో వ్యత్యాసాలు గుర్తించినా చర్యలు ఎందుకు ఆలస్యమయ్యాయి? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. బకాయిలు చెల్లించకుండా ఇతరుల పేర్లతో వ్యాపారాలు కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు ఉండగా, వాటిపై కూడా విచారణ జరగాల్సి ఉంది. మిల్లర్ల పేర్లతో వ్యాపారాలు సాగుతున్నా.. వాటి వెనుక పెట్టుబడులు పెట్టినవారెవరు? కుటుంబసభ్యులు, భాగస్వాములు, ఇతరుల పేర్లతో ఆస్తులు కొనుగోలు చేశారా? అన్న అంశాలపై సమగ్ర విచారణ జరగాల్సి ఉంది. పొలిటికల్, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారుల కుటుంబసభ్యుల పేర్లు వినిపిస్తున్న నేపథ్యంలో వాటిపైనా సీఐడీ, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లు విచారణ జరుపుతుండడం చర్చనీయాంశమవుతోంది.
మిల్లర్ల ముసుగులో బినామీలుగా వ్యాపారం..
రూ.కోట్లల్లో ప్రభుత్వ ధాన్యం ఎగవేత
ఓ పోలీస్ అధికారి కుటుంబ సభ్యులపై
గతంలో కేసు
జేఎస్ భూపాలపల్లి డీఎస్‌ఓపై ఎస్పీ రిపోర్టు
విజిలెన్స్, సీఐడీ దర్యాప్తులో
వెలుగుచూస్తున్న అక్రమాలు


