కాజీపేట రూరల్: కాజీపేట ప్రజల ఏళ్ల కల సాకా రం కానుంది. అందరూ ఎదురు చూస్తున్న రైల్వే కోచ్ మాన్యుఫాక్చరింగ్–ఆర్ఎంయూ యూనిట్ నిర్మాణ పనులు (చిన్న చిన్న పనులు మినహా) పూర్తయ్యాయి. కాజీపేట మండలం అయోధ్యపురం శివారులో 160 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.560 కోట్ల వ్యయంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కోచ్ ఫ్యాక్టరీని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. 2009–10 రైల్వే బడ్జెట్లోనాటి యూపీఏ ప్రభుత్వంలో రైల్వే మంత్రి మమతా బెనర్జీ పీపీపీ విధానంతో రైల్వే వ్యాగన్ల తయారీ పరిశ్రమను మంజూరు చేశారు. ఎన్నో మలుపులు, అనేక ఉద్యమాల ఫలితంగా రైల్వే వ్యాగన్ మాన్యుఫాక్చరింగ్ యూ నిట్ నుంచి వ్యాగన్ పీఓహెచ్ షెడ్డు, ఆ తర్వాత వ్యాగన్ రిపేర్ షెడ్డు మంజూరైంది. ఆతర్వాత 2024 లో ప్రధాని నరేంద్రమోదీ హనుమకొండ పర్యటనలో ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో నిర్వహించిన సభలో రైల్వే మానుఫ్యాక్చరింగ్ యూనిట్‌గా అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
చురుగ్గా పనులు..
నాటి నుంచి నేటి వరకు నిర్మాణ పనులు చురుగ్గా సాగుతూ వస్తున్నాయి. ఈరైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రాజెక్ట్‌ను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, లెటెస్ట్ టెక్నాలజీతో దేశంలో ఉన్న అన్ని రైల్వే యూనిట్లకంటే బెటర్‌గా కాజీపేట యూనిట్‌ను రైల్వే శాఖ, ఆర్వీఎన్ఎల్, పవర్‌మెక్ ప్రాజెక్ట్ వారు కలిసి చేస్తున్నా రు. ఇటీవల ఇక్కడ కోచ్‌ల ఉత్పత్తికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రైల్వేశాఖ, ఫ్యాక్టరీ ప్రారంభం తర్వాత ఉద్యోగాల భర్తీ చేయాల్సి ఉంది. డిసెంబర్లో ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించేందుకు సిద్ధం చేస్తున్నట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు.
పెండింగ్‌లో ఉన్న పనులు..
యూనిట్ ప్రాంగణంలో క్లీనింగ్ పనులు, పార్కింగ్ కోసం రోడ్డు విస్తరణ, మెకానికల్ విభాగంలో గ్యాస్ మ్యాన్ ఫోల్డ్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అదేవిధంగా ప్రధానమైన కాజీపేట ఆర్ఎంయూ ఉద్యోగుల కోసం రైల్వే శాఖ కడిపికొండ బ్రిడ్జి వద్ద క్వార్టర్స్ నిర్మిస్తున్నారు. సుమారు 40 మందికి క్వార్టర్స్ నిర్మాణం జరుగుతోంది.
అందరి చూపు ఉద్యోగాలపైనే..
కాజీపేట రైల్వే కోచ్‌ఫ్యాక్టరీలో తమకు ఉద్యోగాలు ఇవ్వాలని ఫ్యాక్టరీ నిర్మాణానికి భూమి ఇచ్చిన వారు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. కోచ్ ఫ్యాక్టరీకి భూమి ఇచ్చిన వారికి, ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిరుద్యోగులు, ఆక్ట్ అప్రంటీస్ చేసిన వారికి ఉద్యోగాలివ్వాలని కాజీపేట రైల్వే జేఏసీ ఆధ్వర్యంలో కాజీపేట నుంచి ఢిల్లీ వరకు అనేక ఉద్యమాలు కొనసాగాయి. నాయకులు కేంద్ర, రాష్ట్ర మంత్రులను, రైల్వే అధికారులను కలిసి విన్నవించారు. ఇప్పటి వరకు కోచ్ ఫ్యాక్టరీలో ఉద్యోగాల విషయాన్ని రైల్వే శాఖ ప్రకటించకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఏర్పడిన పరిశ్రమల్లో ఈ ప్రాంతం వారికి ఉద్యోగాలు కల్పించాలని అన్ని రాజకీయపార్టీల ఎంపీలు, కేంద్రమంత్రులు, ఎమ్మెల్యేలు కేంద్రాన్ని ఒప్పించి న్యాయం చేయాలని ఉమ్మడి జిల్లా నిరుద్యోగులు కోరుతున్నారు.
కాజీపేట రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ నిర్మాణం పూర్తి
డిసెంబర్లో ప్రధానితో ప్రారంభించేందుకు సన్నాహాలు
రైల్వే క్వార్టర్స్‌తో పాటు చిన్న పనులు పెండింగ్
ఉద్యోగాల నియామకంపై ఎదురుచూపులు


