● జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
వేలేరు: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలవాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. షోడాషపల్లిలోని ఆయన నివాసంలో చిల్పూరు, ధర్మసాగర్, వేలేరు మండలాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుపై సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 20 ఏళ్లుగా స్టేషన్‌ఘన్‌పూర్‌కు ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసింది ఏం లేదని, డాక్టర్ రాజయ్య ఎమ్మెల్యేగా చేసిన అభివృద్దే గ్రామాల్లో కనిపిస్తోందని పేర్కొన్నారు. రూ.104 కోట్లతో మండలంలో సాగునీటి ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేస్తే, ఇప్పటికి ఆపనులు పూర్తిచేసి సాగునీరు అందించాలనే ఆలోచన ఎమ్మెల్యే కడియం శ్రీహరికి లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎల్‌నినోతో వచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువని విమర్శించారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, జనగామ, ఘన్పూర్ నియోజకవర్గాలను రెండు కళ్లలాగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ సర్పంచ్‌లకు నిధులు ఇవ్వకుండా కడియం శ్రీహరి బెదిరిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ కడియం శ్రీహరిది పార్టీలు మారే కమిట్మెంట్ అని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని పదవులు అనుభవించి నమ్మకద్రోహం చేసిన వ్యక్తిని ఉపఎన్నిక వస్తే చిత్తుగా ఓడిస్తామని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య, ఎమ్మెల్సీ ఎన్నికల నియోజకవర్గ ఇన్చార్జ్ నాగుర్ల వెంకటేశ్వర్లు, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు మనోజ్‌రెడ్డి, రాధికారెడ్డి, రమేశ్, సోమిరెడ్డి, సర్పంచ్‌లు కిరణ్, అనిత, మానస, మౌనిక, రమాదేవి పాల్గొన్నారు.


