పరకాల: రైతులకు అన్యాయం జరగొద్దంటే తాము సూచించిన నాణ్యమైన విత్తనాలనే వ్యాపారులు విక్రయించాలి.. రైతులు కొనాలంటూ ప్రభుత్వం సూచించిన వరి విత్తనాల్లో ఓ రకం రైతులను నిండాముంచింది. రాత్రింబవళ్లు కష్టపడి వ్యవసాయం చేస్తే నకిలీ విత్తనాలతో తమ ఆశలను ఆవిరి అయ్యాయంటూ బాధిత రైతులు బుధవారం పరకాలలోని ఆ విత్తనాలు విక్రయించిన దుకాణం ఎదుట ఆందోళన చేపట్టారు. బాధిత రైతుల కథనం ప్రకారం.. శాయంపేట మండలానికి చెందిన 40 మంది రైతులు ప్రభుత్వం సూచించిన 7 రకాల్లో ఒకటైన డబ్ల్యూజీఎల్ 44 సిద్ధిరకం వరి విత్తనాలను పరకాలలోని ఓ దుకాణంలో కొనుగోలు చేసి 150 ఎకరాల్లో సాగుచేశారు. నీటి కరువు పరిస్థితుల్లో కూడా కష్టపడి పంటలను కాపాడుకున్న రైతులు వరి కొయ్యలకు గొలుసులు రాకపోవడంతో కలవరానికి గురయ్యారు. ఇప్పటికే ఒక్కో రైతు ఎకరానికి రూ.50వేల పెట్టుబడి పెట్టాడు. తమకంటే వెనుక సాగుచేసిన వారి పంటలకు గొలుసులు రావడంతో తాము నకిలీ విత్తనాలతో మోసపోయినట్లు గుర్తించారు. దీంతో బాధిత రైతులంతా సంబంధిత దుకాణం వద్దకు బిల్లులతో చేరుకుని ఆందోళన చేపట్టారు. దుకాణ యజమానిపై చర్యలు తీసుకోవడంతో పాటు నకిలీ విత్తనాలతో నష్టపోయి పంటలకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సూచించిన విత్తనాలనే తాను విక్రయించానంటూ వ్యాపారి బుకాయించడంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది.
విత్తనాల్లో కల్తీ జరిగితే చర్యలు..
బాధిత రైతులకు అన్యాయం జరగకుండా వ్యవసాయ శాఖ చర్యలు తీసుకుంటుందని ఏఓ శ్రీనివాస్ ‘సాక్షి’కి తెలిపారు. రైతుల ఆందోళన తమ దృష్టికి వచ్చిందన్న ఆయన.. పరకాలలోని ఓ ట్రేడర్స్ (షాపు) యజమానికి జోగంపల్లి వద్ద కూడా మరో బ్రాంచ్ ఉందన్నారు. అక్కడ ఏమైనా కల్తీ జరిగిందా.. విత్తనాల్లో ఏమైనా తేడాలు ఉన్నాయా అని తెలుసుకుని వ్యాపారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
విత్తనాలు అమ్మిన దుకాణం ఎదుట ఆందోళన


