రైలు సర్వీసుల పొడిగింపు
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్–సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య నడుస్తున్న ప్రత్యేక రైలు సర్వీసులను పొడిగించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
కురవని వానలు.. ఎండిన పంటలు
● జిల్లా అంతటా కరువే.. 14 మండలాలు ప్రభావితం
● అడుగంటిన బోర్లు, బావులు.. మాడిపోయిన వరి, మక్క
● నీటి కోసం కొత్త బోర్లు.. ట్యాంకర్లు.. కిలోమీటర్ల పైపులైన్లు
● ఉపగ్రహ చిత్రాల్లోనూ తగ్గుతున్న పచ్చదనం
సాక్షి ప్రతినిధి, వరంగల్:
ఒకప్పుడు బోరు మోటారు ఆన్ చేస్తే పొలానికి నీరు.. బావిలోకి తొంగిచూస్తే నీరు.. వర్షం కురిస్తే చెరువులు, కుంటలు నిండేవి. ఇప్పుడు పరిస్థితి మారింది. బోరు ఉంది.. నీరు లేదు. బావి ఉంది.. అడుగంటిపోయింది. పొలం ఉంది.. పంట లేదు. వర్షం కోసం ఆకాశం వైపు చూసిన రైతు.. ఇప్పుడు భూగర్భజలం కోసం నేలవైపు చూస్తున్నాడు. పంటను కాపాడుకునేందుకు కొత్త బోర్లు వేస్తున్నాడు. నీరు దొరికితే దూరం నుంచి పైపులు లాగుతున్నాడు. మరికొందరు ట్యాంకర్లతో నీటిని కొనుగోలు చేసి పంటను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాలో కరువు ప్రాంతాలపై ‘సాక్షి’ గ్రౌండ్‌రిపోర్ట్.
ఉరుముతున్న కరువు..
జిల్లాలోని మొత్తం 14 మండలాలూ కరువు ప్రభావిత జాబితాలోకి రావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. సెప్టెంబర్ 30 జిల్లాలో 35 శాతం లోటు వర్షపాతం నమోదైంది. అక్టోబర్ 23 నాటికి రాష్ట్రంలోని పూర్తిగా లోటు వర్షపాతం ఉన్న జిల్లాల్లో హనుమకొండ కూడా చేరింది.
ఆత్మకూరు.. అప్పుడే హెచ్చరిక..
జిల్లాలోని ఆత్మకూరు మండలం కరువు తీవ్రతకు ముందుగానే సంకేతమిచ్చింది. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 1 వరకు అక్కడ సాధారణ వర్షపాతంతో పోలిస్తే 64 శాతం లోటు నమోదైంది. రాష్ట్రంలో తీవ్రమైన వర్షపాతం లోటు ఉన్న మండలాల జాబితాలో ఆత్మకూరు నిలిచింది. ఇది కేవలం వర్షం తక్కువ పడిన కథ కాదు. వర్షం తగ్గడంతో నేలలో తేమ తగ్గింది. పంటలకు నీటి అవసరం పెరిగింది. బోర్లపై ఆధారపడటం పెరిగింది. దాంతో భూగర్భజలాలపై ఒత్తిడి మరింత పెరిగింది.
అడుగంటిన భూగర్భజలాలు..
భూగర్భజల శాఖ గణాంకాలు కూడా ఆందోళనకర పరిస్థితిని చూపుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గత నెలలో సగటు భూగర్భజల మట్టం 7.52 మీటర్ల లోతులో ఉండగా, గత ఏడాది ఇదే నెలలో అది 4.41 మీటర్లుగా ఉంది. అంటే ఏడాది వ్యవధిలో సగటున 3.11 మీటర్ల మేర నీటిమట్టం లోతుకు వెళ్లింది. జిల్లాకు సెప్టెంబర్‌లో సగటు భూగర్భజల మట్టం 5.98 మీటర్లుగా నమోదైంది. అక్టోబర్‌కు సంబంధించిన అంచనా నీటిమట్టం 9.60 మీటర్లకు చేరే అవకాశం ఉందని భూగర్భజల పరిస్థితిపై వచ్చిన తాజా విశ్లేషణలో పేర్కొన్నారు. ఇది సాధారణ స్థాయి కొలత కాకుండా, వర్షపులోటు, స్థానిక భౌగోళిక పరిస్థితులు, పంటల సాగు, నీటి వెలికితీత ఆధారంగా రూపొందించిన అంచనాలుగా స్పష్టం చేశారు. శాయంపేట, ఆత్మకూరు, ఎల్కతుర్తి, హసన్‌పర్తి, కమలాపూర్, దామెర, హనుమకొండ, కాజీపేట, నడికూడ, పరకాల మండలాల్లో 32 నుంచి 54 శాతం వర్షపాతం లోటు ఉండగా భూగర్భజల నీటి మట్టం ఒక్క నెలలోనే 5.98 మీటర్ల నుంచి 9.10 మీటర్లకు పడిపోయినట్లు రికార్డులు చెబుతున్నాయి. మిగతా మండలాల్లోనూ పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది.
జిల్లాలో పంటల సాగు అంచనా (ఎకరాల్లో)
సాగైన విస్తీర్ణం
సాగు శాతం
89%
81.39%
సాగైన విస్తీర్ణం
సాగు
శాతం
వర్షం లోటు 35.2%
సాధారణం
నమోదైంది
పత్తి సాగు అంచనా
నాకు ఐదెకరాల భూమి ఉంది. ఈ ఏడాది ఐదు బోర్లు వేసినా నీళ్లు పడలేదు. దీంతో డబ్బులు పోయినా ఫర్వాలేదు అని 6 నెలలు క్రితం రూ.8 లక్షలు పెట్టి బావి తవ్విన. బావిలో కూడా నీళ్లు రాకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. ప్రతి సంవత్సరం ఐదెకరాల్లో వరి సాగు చేయగా ఈసారి నీళ్లు లేకపోవడంతో నాటు వేయకుండా వదిలి పెట్టిన. – మ్యాకల యాదయ్య, పీచర, వేలేరు మండలం
పంటలకు నీరు అందించడానికి బావి నుంచి అదనంగా అర కిలోమీటరు దూరం పైపులైన్ వేసిన. రెండు ఎకరాల్లో అరటి తోట, రెండు ఎకరాల్లో పసుపు, ఎకరం 20 గుంటల భూమిలో పత్తి సాగు చేసిన. సుమారు రూ. మూడు లక్షలతో పైపులు వేసిన. అదనంగా కొత్త మోటారు కొనుగోలు చేసిన. ఇంత ఖర్చు పెట్టినా పంటలకు సరిగా నీరు అందించలేకపోతున్నా. – కూస కుమారస్వామి, అక్కంపేట, ఆత్మకూరు


