● సీనియర్ సివిల్ జడ్జి ఎన్వీ హైమ పూజిత
కమలాపూర్: విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్వీ హైమ పూజిత సూచించారు. కమలాపూర్ జిల్లాపరిషత్ బాలుర, బాలికల, గూడూరు ఉన్నత పాఠశాలలు, కేజీబీవీ, తెలంగాణ మోడల్ స్కూల్, ఎంజేపీ బాలుర, బాలికల గురుకుల పాఠశాలల్లో బుధవారం అవగాహన సదస్సులు నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం ఆధ్వర్యంలో సురక్షిత బచ్పన్ అభియాన్, లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణపై ఆమె ఆమె మాట్లాడారు. ప్రతి ఏటా రాష్ట్రంలో 2,600 మంది బాలలు అదృశ్యం అవుతున్నట్లు పోలీసు గణాంకాలు చెబుతున్నాయని, అపరిచితులను ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని సూచించారు. నేరాల నియంత్రణకు విద్యార్థులు చైతన్యవంతులై కుటుంబ సభ్యులను చైతన్యపర్చాలన్నారు. పోక్సో చట్టం 18 ఏళ్ల కంటే తక్కువ వయసున్న బాలబాలికలందరికీ సమానంగా వర్తిస్తుందని, లైంగిక దాడుల తీవ్రతను బట్టి నిందితులకు 20 ఏళ్ల జైలుశిక్ష నుంచి జీవిత ఖైదు, ఉరిశిక్ష, జరిమానా విధించే అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. బాలబాలికలపై ఎలాంటి వేధింపులు జరిగినా వెంటనే పోలీసులు, చైల్డ్ హెల్ప్‌లైన్ నంబర్ 1098కు సమాచారం అందించాలని కోరారు. అనంతరం పోక్సో చట్టం–2012, బాల్యవివాహాలు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించి యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్‌పై ప్రతిజ్ఞ చేయించారు. డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అడ్వకేట్ కవిత, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ ఏఎస్సై భాగ్యలక్ష్మి, స్థానిక ఎస్సై మధు, పాఠశాలల హెచ్‌ఎంలు, ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


