బిల్ల మహేందర్‌కు పెన్నా సాహిత్య పురస్కారం ప్రదానం | - | Sakshi
Sakshi News home page

బిల్ల మహేందర్‌కు పెన్నా సాహిత్య పురస్కారం ప్రదానం

Oct 26 2026 2:10 AM | Updated on Oct 26 2026 2:10 AM

బిల్ల మహేందర్‌కు పెన్నా సాహిత్య పురస్కారం ప్రదానం నేడు గ్రేటర్‌ వరంగల్‌ గ్రీవెన్స్‌ 3, 4 తేదీల్లో చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు ‘ఎల్టా’ వరంగల్‌ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక మేడారంలో భక్తుల సందడి

హన్మకొండ కల్చరల్‌: పెన్నా రచయితల సంఘం నెల్లూరు అందించే పెన్నా సాహిత్య పురస్కారాన్ని –2026 నగరానికి చెందిన కవి, ఉపాధ్యాయుడు బిల్ల మహేందర్‌కు ప్రదానం చేశారు. ఈ మేరకు నెల్లూరులోని టౌన్‌హాలులో ఆదివారం నిర్వహించిన పెన్నా రచయితల సంఘం వార్షికోత్సవ సభలో మహేందర్‌కు పురస్కారం, జ్ఞాపిక, ప్రసంసపత్రంతో పాటు నగదు బహుమతిని నిర్వాహకులు అందజేసి ఘనంగా సన్మానించారు.

వరంగల్‌ అర్బన్‌: వరంగల్‌ మహా నగరపాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ) ప్రధాన కార్యాలయంలో గ్రీవెన్స్‌ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహిస్తున్నట్లు కమిషనర్‌ టి.వెంకన్న ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు రాత పూర్వకంగా దరఖాస్తులు అందించాలని కోరారు. సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్‌ ఎంతోగానో దోహదం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

హన్మకొండ కల్చరల్‌: వచ్చే నెల 3, 4 తేదీల్లో సాయంత్రం వరంగల్‌లోని భద్రకాళి దేవాలయం సమీపంలోని కీర్తిగార్డెన్స్‌లో విద్యారణ్య ఆర్ష ధర్మ రక్షణ సంస్థ వరంగల్‌ ఆధ్వర్యంలో ధార్మికవేత్త, ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాల కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు వరంగల్‌ రాంకీ ఎన్‌క్లేవ్స్‌లో ఆదివారం రాత్రి జరిగిన సమావేశంలో నిర్వాహకులు ప్రకటించారు. మాతాపితృ భక్తి, ధర్మశ్రద్ధ, రుజువర్తనం, పాపభీతి, దైవభక్తి తదితర అంశాలపై ప్రవచనాలు జరుగుతాయని తెలిపారు. కార్యక్రమంలో వ్యాపారవేత్తలు తోట జగన్నాథం, బజ్జూరి వైకుంఠం, నంబూరు విశ్వేశ్వరరావు, ఆకారపు శశిధర్‌, హరీష్‌, తాటికొండ కేదారి ప్రభాకర్‌, డాక్టర్‌ పోలా నటరాజ్‌, చింతలపాణి వరుణ్‌రెడ్డి, కర్ర రాజిరెడ్డి, భద్రకాళి దేవాలయం ప్రధానార్చకులు భద్రకాళి శేషు, తోట శంకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

కాళోజీ సెంటర్‌: ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ (ఎల్టా) వరంగల్‌ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నికలు ఆదివారం హనుమకొండలోని జీహెచ్‌ఎస్‌లో జరిగాయి. రాష్ట్ర అధ్యక్షుడు టి.వెంకటేశ్వర్‌ రావు అధ్యక్షతన జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా బహునూతుల శశికుమార్‌ (జెడ్పీహెచ్‌ఎస్‌ ఖానాపురం), ప్రధాన కార్యదర్శిగా పెట్టుగడి శ్రీనివాస్‌ (భాంజీపేట), కోశాధికారిగా పులి రాము (టీజీఎంఎస్‌ అమీనాబాద్‌) జాయింట్‌ సెక్రటరీగా టి.శాంతి కిరణ్‌ (పర్వతగిరి), రాష్ట్ర కౌన్సిలర్‌గా బి.మహేంద్రనాథ్‌, మీడియా ఇన్‌చార్జ్‌గా పోగు అశోక్‌, ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌గా కొంగర దయాకర్‌ ఎన్నికయ్యారు. ఎల్టా రాష్ట్ర ఉపాధ్యక్షులు వంగర లక్ష్మణ్‌, జాయింట్‌ సెక్రటరీ కొక్కుల సంపత్‌, అసోసియేషన్‌ అధ్యక్షుడు పూల శ్రీనివాస్‌, సుధాకర్‌రెడ్డి తదితరులు కార్యవర్గాన్ని అభినందించారు.

ఎస్‌ఎస్‌తాడ్వాయి: సమ్మక్క–సారలమ్మ వనదేవతలు కొలువైన మేడారంలో ముందస్తు జాతర సందడి నెలకొంది. ఆదివారం సెలవు రోజు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు బస్సులు, ప్రైవేటు వాహనాల్లో తరలివచ్చారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు మొక్కులు చెల్లించారు. పరిసరాల్లోని అటవీ ప్రాంతంలో చెట్ల కింద విడిది చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement