అధికారులు, ప్రజాప్రతినిధులు
పట్టించుకోవాలి..
కాశిబుగ్గ : వరంగల్ దేశాయిపేటలోని సీకేఎం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో చదువుకోవాలనే ఆకాంక్షతో అడుగులు వేసేవారు. ఇందులో గొప్ప గొప్ప వాళ్లు చదువుకుని ఉన్నత విద్యావంతులయ్యారు. ప్రముఖ దానశీలి చందా కాంతయ్య కలలు నిజం చేశారు. కానీ, ప్రస్తుతం సౌకర్యాలు ఉన్నా అధ్యాపకులు లేరు. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. డిప్యుటేషన్, గెస్ట్ అధ్యాపకులతోనే బోధన కొనసాగుతోంది.
1968లో కళాశాల ప్రారంభం..
ప్రైవేట్, ఎయిడెడ్ ఆధీనంలో ఉన్న సీకేఎం కళాశాల ప్రభుత్వపరం కావడంతో సిబ్బంది ఆనందంతో ఉన్నారు. అయితే, విద్యార్థులు మాత్రం నిరాశకు గురవుతున్నారు. 1968వ సంవత్సరంలో ఇంటర్, డిగ్రీతో ప్రారంభమైన సీకేఎం కాలేజీలో 1990వ సంవత్సరంలో పీజీ కోర్సులను ప్రవేశపెట్టారు. సీకేఎం కళాశాలను 2023 జూన్ 26న ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీంతో అప్పటి వరకు కళాశాలలో పనిచేస్తున్న ప్రైవేట్ సిబ్బంది రెగ్యులర్ కావడంతో 35 మంది అధ్యాపకులు, 29 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ ఇతర కళాశాలలకు అబ్జర్వ్‌పై వెళ్లారు. కళాశాలకు టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ కరువయ్యారు. కేవలం రెగ్యులర్‌గా ఉన్న ఇద్దరు ప్రిన్సిపాళ్లు పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. ఈ నేపథ్యంలో రెగ్యులర్ అధ్యాపకులు లేకపోవడంతో మూడు నెలల నుంచి ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ పాలన కొనసాగుతోంది. నలుగురు అధ్యాపకులు డిప్యుటేషన్, ఒక లైబ్రేరియన్ మాత్రమే రెగ్యులర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. అలాగే, 18 మంది గెస్ట్ లెక్చరర్లకు 14 మంది గెస్ట్ లెక్చరర్లు పనిచేస్తున్నారు. గతంలో 35 మంది అధ్యాపకులు పనిచేయగా ప్రస్తుతం 18 మంది మాత్రమే ఉన్నారు. నాన్ టీచింగ్ స్టాఫ్‌లో భాగంగా ఒక ఆఫీస్ సూపరింటెండెంట్, ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లు, ఇద్దరు రికార్డు అసిస్టెంట్లు, ఒక స్టోర్ కీపర్ విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో 29 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ ఉండగా ప్రస్తుతం ఆరుగురు మాత్రమే ఉన్నారు. దీంతో విద్యార్థులకు విద్యాబోధనతో పాటు అడ్మినిస్ట్రేషన్ పరంగా ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లాలో ఉన్న రంగశాయిపేట, నర్సంపేట, వర్ధన్నపేట డిగ్రీ కళాశాలల్లో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఎక్కువగా ఉన్నందున సీకేఎం కాలేజీకి డిప్యుటేషన్‌పై బదిలీ చేస్తే కొంతవరకు విద్యార్థుల సమస్యలు తీరుతాయని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.
వేలాదిమందిని ఉన్నతులుగా తీర్చిదిద్దిన సీకేఎం కళాశాలను అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. మూడేళ్ల నుంచి రెగ్యులర్ అధ్యాపకులు లేకుండా పనిచేస్తున్న కళాశాలను ఎవరూ పట్టించుకోవడం లేదని వారు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం రెగ్యులర్ పోస్టులు మంజూరు చేసి వెంటనే భర్తీ చేయాలని కోరుతున్నారు. ఇబ్బందులు తొలగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే కొండా సురేఖ.. కళాశాలను సందర్శించి, విద్యార్థుల సమస్యలు తెలుసుకుని పరిష్కారం చూపాలని విద్యార్థులు కోరుతున్నారు.
సీకేఎం కళాశాలలో భర్తీ కాని రెగ్యులర్ టీచింగ్ పోస్టులు
ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు


