15నుంచి ఎయిర్‌పోర్టు పనులు | - | Sakshi
Sakshi News home page

15నుంచి ఎయిర్‌పోర్టు పనులు

Oct 3 2026 1:38 AM | Updated on Oct 3 2026 1:38 AM

15నుంచి ఎయిర్‌పోర్టు పనులు

రూ.13.28 కోట్లతో బౌండరీ వాల్‌ నిర్మాణం ప్రారంభం

సాక్షి, వరంగల్‌: మామునూరు విమానాశ్రయ అభివృద్ధి పనుల్లో మరో కీలక ముందడుగు పడింది. ఈ నెల 15 నుంచి బౌండరీ వాల్‌ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. విమానాశ్రయం కోసం కొత్తగా సేకరించిన భూమి చుట్టూ ప్రీ కాస్ట్‌ ప్రహరీ గోడ నిర్మించడంతో పాటు, ఇప్పటికే ఉన్న గోడ ఎత్తును పెంచేందుకు ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) చర్యలు చేపట్టింది. ఇందుకోసం రూ.13.28 కోట్లతో హైదరాబాద్‌కు చెందిన సైడాక్స్‌ ఇంజనీర్స్‌ అండ్‌ ఇనన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు తాజాగా వర్క్‌ ఆర్డర్‌ జారీ చేసింది. ఈ నెల 14లోపు కాంట్రాక్టు సంస్థ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి, ఏఏఐ వరంగల్‌ విమానాశ్రయ అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ (ఇంజనీరింగ్‌–సివిల్‌) సమక్షంలో పనుల స్థలాన్ని స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. టెండర్‌ నిబంధనల ప్రకారం 15 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంది.

భద్రతా నిబంధనలకు అనుగుణంగా..

ఈ ప్రాజెక్ట్‌లో రెండు ప్రధాన పనులు చేపట్టనున్నారు. విమానాశ్రయం కోసం కొత్తగా సేకరించిన భూమి చుట్టూ ప్రీ కాస్ట్‌ బౌండరీ వాల్‌ నిర్మించనున్నారు. అలాగే ప్రస్తుతం ఉన్న ప్రహరీ గోడ ఎత్తును బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌న్‌ సెక్యూరిటీ (బీసీఏఎస్‌) నిబంధనలకు అనుగుణంగా పెంచనున్నారు. విమానాశ్రయ భూముల పరిరక్షణ, అనధికార ప్రవేశాల నియంత్రణ, భద్రతాపరమైన ఏర్పాట్లకు ఈ పనులు దోహదపడనున్నాయి. ఇదిలా ఉండగా 949.44 ఎకరాల విస్తీర్ణంలో కొద్ది నెలల క్రితం రూ.203.49 కోట్లతో రన్‌ వే ఆధునీకరణనుంచి టెర్మినల్‌కు అనుసంధాన రహదారులు, విమానాల పార్కింగ్‌ ఆప్రాన్‌, ట్యాక్సీ వేలు, గ్రౌండ్‌ సపోర్ట్‌ సదుపాయాల వరకు టెండర్లు పిలిచిన ఏఏఐ...ఇటీవల రూ. 213.59 కోట్ల అంచనా వ్యయంతో నూతన డొమెస్టిక్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌, ఏటీసీ టవర్‌ కమ్‌ టెక్నికల్‌ బ్లాక్‌, ఎలక్ట్రికల్‌ సబ్‌స్టేషన్‌, ఫైర్‌ స్టేషన్‌, ఈఅండ్‌ఎం వర్క్‌షాప్‌ వంటి కీలక మౌలిక వసతులను నిర్మించేందుకు టెండర్లు పిలిచిన విషయం తెలిసిందే. కీలకమైన ఈ పనులు కూడా ట్రాక్‌లోకి ఎక్కితే మామునూరు విమానాశ్రయ నిర్మాణ పనులు ఊపందుకోనున్నాయి.

బౌండరీ వాల్‌ నిర్మాణ పనులకు ఏఏఐ అధికారులు రూ.21,39,52,823 అంచనా వ్యయాన్ని నిర్ణయించారు. టెండర్‌ ప్రక్రియలో సైడాక్స్‌ ఇంజనీర్స్‌ సంస్థ రూ.13,28,86,521.60కు పనులు చేపట్టేందుకు ముందుకొచ్చింది. అంచనా వ్యయం కంటే 37.89 శాతం తక్కువకు టెండర్‌ దక్కించుకుంది. ఈ మొత్తానికి జీఎస్టీ అదనం. వర్క్‌ ఆర్డర్‌ జారీ కావడంతో నిర్మాణానికి అవసరమైన ఏర్పాట్లు పూర్తిచేసి ఈ నెల 15నుంచి పనులు చేపట్టనున్నారు.

కొత్తగా సేకరించిన భూమి చుట్టూ ప్రీ కాస్ట్‌ ప్రహరీ

పాతగోడ ఎత్తు పెంపునకు చర్యలు

15 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement