వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జేఎన్‌ఎస్‌లో ఈనెల 24 నుంచి నిర్వహించనున్న కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ ఎంపిక పోటీలు వర్షం కారణంగా వాయిదా వేసినట్లు ఎస్‌జీఎఫ్ జిల్లా నిర్వహణ కార్యదర్శి వాసుదేవరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వీటితోపాటు ఇటీవల వాయిదా పడిన రెజ్లింగ్ అండర్ 14, 17 ఎంపికలు కూడా వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. మళ్లీ ఎప్పుడు నిర్వహి స్తామనేది ప్రకటించనున్నట్లు తెలిపారు.
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో జరుగుతున్న ఉత్తిష్ట గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం గణపతి నిమజ్జనం చేశారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో మూల మహాగణపతికి అభిషేక పూజలు చేశారు. ఉత్సవమూర్తికి పల్లకీసేవ నిర్వహించారు. ఇందులో సినీ నటుడు, కవి తనికెళ్ల భరణి పాల్గొన్నారు. ఆలయ అనిల్‌కుమార్, ఉపేంద్రశర్మతో పాటు వేదపండితులు మణికంఠశర్మ, అర్చకులు ప్రణవ్, శ్రవణ్‌కుమార్, కాశీలింగాచారి, వేముగంటి దత్తుశర్మ, భక్తులు ఢమరుక వాద్యాలతో మంగళహారతులతో కాషాయజెండాలతో విఘ్నగణపతిని, స్వామివారి త్రిశూలాన్ని ఊరేగింపుగా తీసుకువెళ్లి ప్రాచీనకోనేటి నీటిలో త్రిశూలస్నానం (తీర్థోత్సవం) జరిపారు. అనంతరం రుద్రేశ్వరుడి సన్నిధిలో త్రిశూలాన్ని యథాస్థానంలో ఉంచారు. అనంతరం ఉత్సవ మహాగణపతి విగ్రహాన్ని ట్రాక్టర్‌పై ఊరేగించి పద్మాక్షి గుండంలో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో కుడా చైర్‌పర్సన్ గుండు సుధారాణి, ప్రభాకర్ దంపతులు పాల్గొన్నారు.
హన్మకొండ అర్బన్: నగరంలోని న్యూసైన్స్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో వచ్చే నెల 5న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల డైరెక్టర్ డాక్టర్ కటంగూరి రవీందర్‌రెడ్డి తెలిపారు. ఈమేరకు బుధవారం కళాశాల ఆవరణలో జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ జాబ్‌మేళాలో 50కిపైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగ అభ్యర్థులు, విద్యార్థులు జాబ్‌మేళాలో పాల్గొనవచ్చని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సీహెచ్.కమలాకర్, తెలంగాణ ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఆల్ ఇండియా ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు డాక్టర్ జయరాం, వివిధ కంపెనీల ప్రతినిధులు, కళాశాల ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్ ఆషాద్‌ఖాన్ పాల్గొన్నారు.
విద్యారణ్యపురి: హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పీజీ కోర్సుల విద్యార్థుల బోధనకు అతిథి అధ్యాపకుల నియామకం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య గుర్రం శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెస్సీ మైక్రో బయాలజీ విభాగంలో రెండు పోస్టులకు, ఎమ్మెస్సీ కంప్యూటర్స్ ఒక పోస్టుకు, ఎంఏ తెలుగు ఒక పోస్టుకు అర్హులైన అధ్యాపకులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. సంబంధిత పీజీ సబ్జెక్టుల్లో 55 శాతానికి తక్కువ కాకుండా మార్కులు కలిగి ఉండాలని, ఎస్సీఎస్టీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు ఉండాలని పేర్కొన్నారు. పీహెచ్‌డీ, నెట్, బోధనలో అనుభవం కలిగినవారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు ఈనెల 26 సాయంత్రం 4:30 గంటల్లోగా దరఖాస్తులు కళాశాలల్లో సమర్పించాలని సూచించారు.


