వచ్చేనెల 18 నుంచి ‘సూపర్‌’లో ఓపీ సేవలు! | - | Sakshi
Sakshi News home page

వచ్చేనెల 18 నుంచి ‘సూపర్‌’లో ఓపీ సేవలు!

Sep 24 2026 2:48 AM | Updated on Sep 24 2026 2:48 AM

కాశిబుగ్గ: వరంగల్‌లోని సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులను వేగవంతం చేయడానికి అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో వివిధ శాఖల రాష్ట, జిల్లాస్థాయి ఉన్నతాధికారులు కదిలారు. రాష్ట్రస్థాయి అధికారులతోపాటు జిల్లాస్థాయి అధికారులు సమన్వయంతో పని చేస్తూ ముందుకు వెళ్లడానికి తగిన ప్రణాళిక సిద్దం చేసుకున్నారు. హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌ టిమ్స్‌ ఆస్పత్రి మాదిరిగా రాత్రింబవళ్లు ఆస్పత్రి నిర్మాణ పనులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబర్‌ 18న ఓపీ సేవలను ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

డీఎంఈ, జిల్లా కలెక్టర్‌ పర్యవేక్షణలో..

తాజాగా బుధవారం సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులను పర్యవేక్షించడానికి డీఎంఈ డాక్టర్‌ వాణి అధికారులతో కలిసి వచ్చినట్లు తెలుస్తోంది. సీఎంఓ, డీఏంఈ, హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌లోని ఉన్నతాధికారులతో పాటు ఎల్‌అండ్‌టీ, ఆర్‌ అండ్‌ బీ అధికారులు సమన్వయం చేసుకుంటున్నట్లు సమాచారం. వీరు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తూ, జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద పర్యవేక్షణలో పనులను త్వరితగతిన పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాణపు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, ప్రజలకు వైద్యసేవలు త్వరగా అందించేందుకు ముందుకు వెళ్తున్నట్లు సమాచారం.

సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు పాటిస్తూ..

ఇటీవల హైదరాబాద్‌లో వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిపై జరిగిన సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు సీరియస్‌గా చెప్పారు. 30 రోజుల్లో 24 గంటలు పనిచేస్తూ వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో రాష్ట్రస్థాయిలోని ఐఏఎస్‌ అధికారులు సైతం టీంలుగా ఏర్పడి పనులను పూర్తి చేయడానికి కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది. అలాగే, ఇటీవల ఎంజీఎంలో చోటు చేసుకున్న సంఘటనలు, ప్రతిపక్ష పార్టీల ఆందోళనలు, రోగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి పనులను సూపర్‌ వేగంతో పూర్తిచేసేందుకు కదిలారు. అయితే, ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్‌ 18న ఓపీ సేవలు ప్రారంభం చేయాలని ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. దసరా కానుకగా రెండు రోజుల ముందు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రాథమికంగా ప్రారంభించాలని భావిస్తునట్లు సమాచారం. దీంతో దసరా పండుగ సందర్భంగా పేద ప్రజలకు వైద్య సేవలు అందించినట్లు ఉంటుందని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

ప్రారంభించేందుకు అధికారుల కసరత్తు

దసరా కానుకగా ప్రజలకు వైద్య సేవలు

అందించాలని ప్రభుత్వం నిర్ణయం?

సీఎం ఆదేశాలతో కదిలిన యంత్రాంగం

‘సూపర్‌’ ఆస్పత్రి పనుల పరిశీలన

వరంగల్‌లోని సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని డీఎంఈ డాక్టర్‌ వాణి బుధవారం పరిశీలించారు. వివిధ నిర్మాణ పనులను తనిఖీ చేశారు. పనులు ఎంతవరకు పూర్తయ్యాయి, ఎప్పటి వరకు పూర్తి చేయవచ్చని సంబంధిత అధికారులను, కంపెనీ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఆస్పత్రి ఓపీ పేషంట్లు, ఇన్‌ పేషంట్లు వైద్యసేవల ఏర్పాట్లపై చర్చించారు. ఎంజీఎం నుంచి పేషంట్లను ఇక్కడికి తరలిస్తే వైద్యసేవలకు ఇబ్బందులు రాకుండా ఎలా ఏర్పాట్లు చేయాలని దానిపై క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. ఎంజీఎంలో పేషంట్లకు ఏర్పడుతున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ప్రారంభించే దిశగా వెళ్లాలని సూచించినట్లు తెలుస్తుంది. ఆమెతోపాటు కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద, కేఎంసీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మోహన్‌దాసు, ఎంజీఎం సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాంకుమార్‌రెడ్డి, ఎల్‌అండ్‌టీ, ఆర్‌అండ్‌బీ, ఎన్‌పీడీసీఎల్‌, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ అధికారులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement