వర్ధన్నపేట: నియోజకవర్గానికి మంజూరైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులు ప్రారంభించాలని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కోరారు. ఈ మేరకు శుక్రవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు నాణ్యమైన, ఆధునిక విద్యను అందించాలనే ఉద్దేశంతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేసినందుకు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పాఠశాల నిర్మాణానికి రూ.200 కోట్ల మేర పరిపాలన అనుమతులు మంజూరు చేసినా పనులు ప్రారంభం కాకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి త్వరలో నిర్మాణ పనులు ప్రారంభించాలని ఆయన కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం ప్రవేశపెట్టడం అభినందనీయమన్నారు.


