నోటీసులు వస్తే ఆందోళన వద్దు | - | Sakshi
Sakshi News home page

నోటీసులు వస్తే ఆందోళన వద్దు

Sep 12 2026 1:42 AM | Updated on Sep 12 2026 1:42 AM

నోటీసులు వస్తే ఆందోళన వద్దు

హన్మకొండ అర్బన్‌: ‘సర్‌ ప్రక్రియలో భాగంగా నోటీసులు వచ్చినంత మాత్రాన ఆందోళన చెందాల్సిన పనిలేదు. నోటీసుల్లో పేర్కొన్న ఆధా రాలు సమర్పిస్తే సరిపోతుంది’ అని అదనపు కలెక్టర్‌ ఎన్‌.రవి అన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై ఉన్న సందేహాలు నివృత్తి చేసేందుకు ‘సాక్షి’ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఫోన్‌ ఇన్‌ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. అదనపు కలెక్టర్‌ ఎన్‌.రవి కలెక్టరేట్‌ నుంచి ఫోన్‌ఇన్‌లో పాల్గొన్నారు. కలెక్టరేట్‌ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్‌ జగత్‌సింగ్‌తో కలిసి ప్రజల సందేహాలు నివృత్తి చేశారు.

ప్రశ్న: ఆధార్‌, ఓటరు గుర్తింపు కార్డులలో పేరు తప్పుగా ఉంది.. ఏం చేయాలి?

–నవీన్‌, పరకాల/స్వామి, రత్నగిరి, భీమదేవరపల్లి

అదనపు కలెక్టర్‌: స్పెల్లింగ్‌ తప్పు పెద్ద సమస్యమీ కాదు. అయితే ఎన్నికల నిబంధనల ప్రకారం ఎస్‌ఐఆర్‌లో అలాంటి లోపం ఉంటే ఆటోమేటిక్‌గా నోటీస్‌ జారీ అయ్యే అవకాశం ఉంటుంది. ఎన్నికల సంఘం సూచించిన 12 రకాల గుర్తింపు పత్రాల్లో పేరులో స్పెల్లింగ్‌ సరిగ్గా ఉన్న ఏదైనా ఒక పత్రాన్ని తీసుకెళ్లి బూత్‌ స్థాయి అధికారికి సమర్పించాలి. మీరు వెళ్లలేకపోతే బంధువులు, కుటుంబ సభ్యుల ద్వారా పత్రాలు అందించవచ్చు.

ప్రశ్న: 25 ఏళ్లుగా గ్రామంలో ఉంటున్నాం. 2002 నాటి వివరాలు అడుగుతున్నారు.. ఏం చేయాలి?

– అమ్మ అశోక్‌, పెద్దకోడెపాక, శాయంపేట

అదనపు కలెక్టర్‌: నోటీసులు అందుకున్న వారు 1987 తర్వాత పుట్టినవారైతే వారి తల్లిదండ్రులకు సంబంధించిన వివరాలు సమర్పిస్తే సరిపోతుంది. నోటీసులో కోరిన ఆధారాలను బూత్‌ స్థాయి అధికారికి అందజేయాలి.

ప్రశ్న: మా ఓట్లు తొలగించారు. ముసాయిదా జాబితాలో పేర్లు లేవు. మేం ఇచ్చిన వివరాలను బూత్‌ స్థాయి అధికారి నమోదు చేయలేదని తెలిసింది. ఇప్పుడేం చేయాలి?

– ఎ.రవి, హనుమకొండ

అదనపు కలెక్టర్‌: వివరాలు నమోదు చేయడంలో ఏదైనా పొరపాటు జరిగి ఉంటే అధికారులు పరిశీలిస్తారు. అభ్యంతరాలు దాఖలు చేసేందుకు అవకాశం ఉంది. సంబంధిత సహాయ ఎన్నికల నమోదు అధికారికి లిఖితపూర్వకంగా దరఖాస్తు ఇవ్వాలి. ఓటరు జాబితాలో పేర్లు లేని వారి వివరాలు అందిస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటారు.

ప్రశ్న: మా ఇంట్లో నలుగురికి నోటీసులు ఇచ్చారు. పాత వివరాలు అడుగుతున్నారు. ఏం ఇవ్వాలి?

– డోలిపురి రామచంద్రన్‌, పరకాల

అదనపు కలెక్టర్‌: పెద్దలకు బ్యాంక్‌ పాస్‌బుక్‌, పట్టాదారు పాస్‌బుక్‌ తదితర ఎన్నికల సంఘం సూచించిన ఆధారాల్లో ఏదైనా సమర్పించాలి. యువతకు సంబంధించిన నోటీసులు ఉంటే జన న ధ్రువపత్రాలు, పదో తరగతి మెమోతో పాటు తల్లిదండ్రుల ఓటరు వివరాలను అందజేయాలి.

ప్రశ్న: ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు ఉంటే ఓటు హక్కు వచ్చినట్టేనా?

– శివప్రసాద్‌, ఆత్మకూరు

అదనపు కలెక్టర్‌: ముసాయిదా జాబితాలో పేరు ఉన్నప్పటికీ నోటీసులు వచ్చిన వారు అందులో కోరిన వివరాలను తప్పనిసరిగా సమర్పించాలి. ప్రస్తుతం అసంపూర్తిగా ఉన్న వివరాలకు సంబంధించి నోటీసులు ఇచ్చారు. గడువులోగా స్పందించకపోతే రెండో నోటీసు ఇచ్చే అవకాశం ఉంది.

ఎక్కడున్నా ఓటర్‌ పోర్టల్‌లో వివరాలు పరిశీలించుకోవచ్చు

అదనపు కలెక్టర్‌ ఎన్‌.రవి

‘సర్‌’ ప్రక్రియపై ‘సాక్షి’ ఫోన్‌ ఇన్‌

ఓటర్ల నుంచి విశేష స్పందన

ప్రశ్న: నేను 1962లో పుట్టాను. నాకు ఓటు హక్కు ఉంది. అయినా నోటీసు ఎందుకు ఇచ్చారు? నా ఓటు ఉంటుందా.. తీసేస్తారా?

– వెంకటేశ్వర్లు, నేరెళ్ల, కమలాపూర్‌

అదనపు కలెక్టర్‌: నోటీసు ఇచ్చినంత మాత్రాన ఓటు తొలగిస్తారని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నిబంధనల ప్రకారం స్పెల్లింగ్‌ తప్పులు లేదా ఇతర వివరాల్లో లోపాలు ఉన్నా నోటీసులు జారీ చేసే అవకాశం ఉంటుంది. నోటీసులో కోరిన సరైన పత్రాలను బూత్‌ స్థాయి అధికారికి అందించాలి. వాటిని పరిశీలించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటారు.

ప్రశ్న: మాది దామెర గ్రామం. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నాం. ఊరిలోనే ఓటు కావాలి. ముసాయిదా జాబితాను ఎలా చూసుకోవాలి? నోటీసులు ఎవరికి ఇస్తారు?

– రాజు, దామెర

అదనపు కలెక్టర్‌: మీరు ఎక్కడున్నా ఎన్నికల సంఘం ఓటర్‌ పోర్టల్‌లో మీ వివరాలను పరిశీలించుకోవచ్చు. అందులో పేరు ఉంటే ఇబ్బంది లేదు. ఒకవేళ పేరు ఉన్నప్పటికీ నోటీసు వచ్చినట్లు తెలిస్తే సంబంధిత బూత్‌ స్థాయి అధికారికి నోటీసులో అడిగిన వివరాలను అందజేయాలి.

ప్రశ్న: నోటీసుకు ఇచ్చిన సమాధానంతో అధికారులు సంతృప్తి చెందారో లేదో ఎలా తెలుస్తుంది? – తారాబాయి,

చైతన్యపురి కాలనీ, హనుమకొండ

అదనపు కలెక్టర్‌: నోటీసు వచ్చిన అనంతరం తగిన ఆధారాలను అధికారికి సమర్పిస్తే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. ఒకవేళ తప్పుడు ధ్రువీకరణ పత్రాలు అందించినా, సమాచారం మిస్‌మ్యాచ్‌ అయినా రెండో నోటీస్‌ అందిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement