‘రెరా’.. వెంచర్లపై ఆరా! | - | Sakshi
Sakshi News home page

‘రెరా’.. వెంచర్లపై ఆరా!

Sep 12 2026 1:42 AM | Updated on Sep 12 2026 1:42 AM

‘రెరా’.. వెంచర్లపై ఆరా!

సాక్షి, వరంగల్‌: ‘వ్యవసాయ భూమి’.. ‘ఫామ్‌ ల్యాండ్‌’.. ‘ఆర్గానిక్‌ ఫామ్‌’.. ‘వీకెండ్‌ ఫామ్‌’.. పేర్లు వేరైనా వ్యాపారం మాత్రం ఒక్కటే. ఎకరాల కొద్ది వ్యవసాయ భూమిని సేకరించి రోడ్లు వేయడం, చిన్నచిన్న భాగాలుగా విభజించడం, భవిష్యత్‌ విలువ పెరుగుతుందని వినియోగదారులకు ప్లాట్లను విక్రయించడం.. ఇలా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో రియల్‌ ఎస్టేట్‌ విస్తరిస్తోంది. వ్యవసాయ భూమిని రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టుగా అభివృద్ధి చేసి విక్రయించే వ్యవహారాలపై రెరా (రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ) నిబంధనలు కఠినంగా అమలు చేసేందుకు సిద్ధమైంది. ఇటీవలి ఎస్‌ఎస్‌ఎల్‌ ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ వ్యవహారంలో తెలంగాణ రెరా, అనంతరం అప్పీళ్ల స్థాయిలో వెలువడిన తీర్పు నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయభూముల పేరుతో రియల్‌ ఎస్టేట్‌ చేస్తున్న ప్రాజెక్టులను గుర్తించి, వాటిని రెరా చట్టం కింద రిజిస్ట్రేషన్‌ చేసేందుకు చర్యలు తీసుకోవాలనడంతో ఉమ్మడి వరంగల్‌లోని వ్యవసాయ భూముల పేరుతో వెంచర్లు చేస్తున్న వా రిలో వణుకు మొదలైంది. వందలాది ఎకరాల్లో.. రూ.కోట్లలో ఈవ్యాపారం జరుగుతుందనే చెప్పాలి.

ఆరు జిల్లాల్లో భూములకు డిమాండ్‌

వరంగల్‌, హనుమకొండ, జనగామ, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌ జిల్లాల్లోని పట్టణాల చుట్టుపక్కల భూములకు డిమాండ్‌ పెరుగుతోంది. రైతుల నుంచి పెద్దఎత్తున భూములు కొనుగోలు చేసి వెంచర్లు చేసే సంస్కృతి పెరుగుతోంది. రెరా రిజిస్ట్రేషన్‌ లేకుండా ‘వెంచర్‌’, ‘ఫామ్‌ ప్లాట్‌’, ‘గేటెడ్‌ ఫామ్‌’ వంటి పేర్లతో మార్కెటింగ్‌ చేసే ప్రాజెక్టులపై అధికారులు దృష్టి సారించే అవకాశం ఉంది.

కొనుగోలుదారుడికి లాభమేంటంటే?

రెరా పరిధిలోకి వచ్చే ప్రాజెక్టుకు రిజిస్ట్రేషన్‌ ఉంటే కొనుగోలుదారుడికి ఆమోదిత లేఔట్‌, ప్రాజెక్టు వివరాలు, అభివృద్ధి దశ, బుకింగ్‌ స్థితి, అనుమతులు తదితర వివరాలు ఆన్‌లైన్‌లో చూసుకోవచ్చు. అలాగే, ప్రాజెక్జు రిజిస్ట్రేషన్‌కు ముందు మార్కెటింగ్‌, బుకింగ్‌, విక్రయాలపై కూడా రెరా చట్టం నియంత్రణ ఉంటుంది. రిజిస్ట్రేషన్‌ లేకుండా ప్రాజెక్టును ప్రచారం చేస్తే ప్రమోటర్‌పై చర్యలు, జరిమానా విధిస్తారు.

చట్టబద్ధమైన వెంచర్లకు డిమాండ్‌..

ఇకపై వ్యవసాయం కోసం భూమి కొనేవారు, రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులో ప్లాట్‌ కొనేవారు అనే తేడా కనిపించనుంది. అనుమతులు లేకుండా కేవలం భవిష్యత్‌ విలువ పేరుతో విక్రయించే ప్రాజెక్టులకు డిమాండ్‌ తగ్గి, చట్టబద్ధంగా అభివృద్ధి చేసిన వెంచర్లకు ప్రాధాన్యం పెరగవచ్చని రియల్‌ ఎస్టేట్‌ వర్గాలు భావిస్తున్నాయి.

అన్ని అంశాలు పరిశీలించాలి,,

కొనుగోలుదారులకు ‘ప్లాట్‌ ఎక్కడ ఉంది?’ అన్నదానికంటే ‘ఆ ప్లాట్‌ ఏ అనుమతుల పరిధిలో ఉంది?’ అన్నదే కీలకం. రెరా నంబర్‌, ఆమోదిత లేఔట్‌, భూమి హక్కులు, భూమి వినియోగం, నిషేధిత జాబితా, ఎన్‌కంబరెన్స్‌ వంటి అంశాలను పరిశీలించిన తర్వాతే పెట్టుబడి పెట్టడం సురక్షితం

– అజిత్‌రెడ్డి, కుడా పీఓ

వ్యవసాయ భూమి పేరుతో

ప్లాట్లు చేసే ప్రాజెక్టులపై దృష్టి

రెరా చట్టం కింద రిజిస్ట్రేషన్‌

చర్యలతో ఒక్కసారిగా చర్చ

ఫలితంగా ఉమ్మడి వరంగల్‌లో రియల్‌ ఎస్టేట్‌పై ప్రభావం

జిల్లా ప్రాజెక్టులు

వరంగల్‌ అర్బన్‌ 427

వరంగల్‌ రూరల్‌ 14

జనగామ 26

భూపాలపల్లి 12

మహబూబాబాద్‌ 29

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement