ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి
హన్మకొండ అర్బన్: వినాయక చవితి, నిమజ్జన వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం హనుమకొండ కలెక్టరేట్‌లో కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి సంబంధిత అధికారులతో నిమజ్జన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. నిమజ్జనానికి అనువైన చెరువులు, నీటి వనరులను ముందుగానే గుర్తించి అవసరమైన చోట నిమజ్జన పాండ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని, మండపాల వద్ద విద్యుత్ వైరింగ్‌ను ముందుగానే తనిఖీ చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలని ఆదేశించారు. కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు ప్రజలు ముందుకు రావాలని కోరారు. నీటి లభ్యత తక్కువగా ఉన్న నేపథ్యంలో నిమజ్జన సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా తక్కువ ఎత్తు ఉన్న విగ్రహాలను ప్రతిష్ఠించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రవి, రెడ్‌క్రాస్ రాష్ట్ర పాలక మండలి సభ్యుడు ఈవీ శ్రీనివాస్‌రావు, జీడబ్ల్యూఎంసీ, పట్టణ ప్రణాళిక, పోలీస్, విద్యుత్, వైద్య ఆరోగ్య, ట్రాఫిక్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
హన్మకొండ: హనుమకొండ కేఎల్‌ఎన్ రెడ్డి కాలనీలోని శక్తి సదన్‌ను హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆశ్రయం పొందుతున్న బాలికలు, మహిళలతో మా ట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. శక్తి సదన్‌లో అందిస్తున్న కంప్యూటర్ శిక్షణ, టైలరింగ్ శిక్షణ వంటి వృత్తి విద్యా కోర్సుల వివరాలు అడిగి తెలుసుకున్నా రు. విద్యాఽభ్యాసం పూర్తి చేసిన వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. కలెక్టర్ వెంట జిల్లా సంక్షేమ అధికారి విశ్వజ, ఈఓ ఆశాదేవి, శక్తిసదన్ సూపరింటెండెంట్ శైలజ పాల్గొన్నారు.
కాజీపేట బస్‌స్టేషన్ ప్రతిపాదిత స్థల పరిశీలన..
కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్‌లోని శాశ్వత ఆర్టీసీ బస్ స్టేషన్ నిర్మాణానికి రైల్వేకు సంబంధించిన ప్రతిపాదిత స్థలాన్ని హనుమకొండ కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్ గురువారం పరిశీలించారు. ప్రస్తుతం సిటీ బస్సుల రాకపోకలు కొనసాగుతున్న రైల్వే స్టేషన్ ఎదుట ఉన్న స్థలాన్ని రైల్వే పాఠశాల స్థలం, రైల్వే స్టేడియం ప్రాంతంతో పాటు స్టేడియానికి ఎదురుగా ఉన్న రైల్వేకు చెందిన సుమారు ఎకరం భూమిని కలెక్టర్ అధికారులతో కలసి పరిశీలించారు. కాజీపేట ప్రధాన రహాదారి పక్కన ఉన్న హైదరాబాద్‌కు వెళ్లే ఆర్టీసీ బస్సులు ఆగే బస్టాండ్‌ను ఆమె పరిశీలించారు.


