సేవలకు సెలవు! | - | Sakshi
Sakshi News home page

సేవలకు సెలవు!

Sep 11 2026 11:15 AM | Updated on Sep 11 2026 11:15 AM

నర్సంపేట మున్సిపాలిటీలో నిలిచిన సర్టిఫికెట్ల జారీ

నర్సంపేట: మున్సిపల్‌ కమిషనర్‌కు సంబంధించిన డిజిటల్‌ కీ నిలిచిపోవడంతో పట్టణ ప్రజలకు అందాల్సిన సేవలు నిలిచిపోయాయి. దీంతో ట్రేడ్‌ లైసెన్స్‌, జనన, మరణ సర్టిఫికెట్లతో పాటు ఇతర సేవలు నిలిచిపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. నర్సంపేట మున్సిపాలిటీలో కమిషనర్‌ డిప్యుటేషన్‌ గడువు ముగియడంతో 25 రోజులుగా డిజిటల్‌ కీ నిలిచిపోయింది. దీంతో ట్రేడ్‌ లైసెన్స్‌, జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీతో పాటు ఇతర సేవలకు సంబంధించి పనులు కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటివరకు వివిధ సర్టిఫికెట్ల జారీకి సంబంధించిన 175 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వాస్తవానికి కమిషనర్‌గా కొనసాగుతున్న కాటం భాస్కర్‌ డిప్యుటేషన్‌ కాలం ముగిసి నాలుగు నెలలు అవుతుంది. ఆయన కొనసాగింపుపై ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాకపోవడంతో సందిగ్ధత నెలకొంది. 2025 మే 8న పెద్దపల్లి జిల్లాలో మండల పంచాయతీ అధికారిగా పని చేసిన భాస్కర్‌ను నర్సంపేట కమిషనర్‌గా డిప్యుటేషన్‌పై నియమిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తర్వాత ఓ గ్రూప్‌–2 అధికారిని నియమించినప్పటికీ కమిషనర్‌గా జాయిన్‌ కాలేదు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ఇతర శాఖ అధికారులు, డిప్యుటేషన్‌పై ఉన్న కమిషనర్‌లను ప్రభుత్వం వెనక్కి పంపించింది. దీంతో పాటు రెగ్యులర్‌ కమిషనర్‌ను నియమించినప్పటికీ నర్సంపేటలో మాత్రం ఎంపీఓను డిప్యుటేషన్‌పై నర్సంపే ట మున్సిపల్‌ కమిషనర్‌గా కొనసాగిస్తూ వచ్చారు.

ప్రిన్సిపల్‌ సెక్రటరీ వద్ద పెండింగ్‌

మున్సిపల్‌ కమిషనర్‌గా డిప్యుటేషన్‌పై వచ్చిన భాస్కర్‌ గడువు మే నెలలోనే ముగిసింది. అప్పటినుంచి డిప్యుటేషన్‌ కొనసాగింపుపై ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. ఫైల్‌ హైదరాబాద్‌లోని ఉన్నతాధికారుల వద్ద పెండింగ్‌లో ఉండటంతో డిజిటల్‌ కీని తొలగించారు. తదుపరి కొనసాగింపు అనుమతులు వస్తేనే డిజిటల్‌ కీని మరో ఏడాదిపాటు రెన్యువల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి 25 రోజులు గడిచిపోవడంతో ఇంటి నిర్మాణ అనుమతులు, ఇంటి నంబర్లు, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, మ్యుటేషన్‌, తదితర సేవలు జరగకపోవడంతో పట్టణ ప్రజలు మున్సిపల్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.

నర్సంపేట మున్సిపల్‌ కమిషనర్‌గా డిప్యుటేషన్‌ కొనసాగింపుపై ఉన్నతాధికారులు ఉత్తర్వులు ఇచ్చే అవకాశంపై సందిగ్ధత నెలకొంది. 25 రోజులుగా కమిషనర్‌కు సంబంధించి డిజిటల్‌ కీ నిలిపేయడంతో ఉత్తర్వుల కోసం ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ జాప్యం జరుగుతోంది. తాజాగా మంగళవారం ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వుల కోసం కమిషనర్‌ హైదరాబాద్‌కు వెళ్లినట్లు సమాచారం. అయినప్పటికీ కొనసాగింపుపై ఎలాంటి స్పష్టత రాలేదు.

ఉత్తర్వులు వచ్చేనా...

మున్సిపల్‌ కమిషనర్‌

కొనసాగింపుపై సందిగ్ధం

పెండింగ్‌లో 175 దరఖాస్తులు

ఇబ్బందులు పడుతున్న పట్టణవాసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement