ఉత్తమ టీచర్ల ఎంపికపై కలెక్టర్‌కు ఫిర్యాదు
కాళోజీ సెంటర్: విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దే అపారమైన శక్తి గురువు చేతుల్లో ఉంటందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని జిల్లావిద్యాశాఖ ఆధ్వర్యంలో వరంగల్ ఉర్సుగుట్ట ఆకుతోట కన్వెన్షన్‌లో శనివారం ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతిప్రజ్వలన చేసి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. డీఈఓ రంగయ్యనాయుడు అధ్యక్షతన వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ఉపాధ్యాయుల చేతిలో బెత్తం, పోలీసుల చేతిలో లాఠీ లేదని పేర్కొన్నారు. విద్యార్థి దశలో తనను ఉపాధ్యాయుడు కొడితే చేతివేలు పగిలి రక్తం వస్తే తల్లిదండ్రులకు కూడా చెప్పలేదని చెప్పారు. ఇంకా కొట్టినా ఫర్వాలేదు అని తన తండ్రి ఉపాధ్యాయుడికి అనుకూలంగా మాట్లాడిన సందర్భాలు ఉంటే.. నేడు అందుకు భిన్నంగా హత్యచేసే పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్, మాదకద్రవ్యాలకు బానిసగా మారి పిల్లలు భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చదివించాలని ఆయన తల్లిదండ్రులను కోరారు. ఉపాధ్యాయుల సమస్యలను కొడంగల్ సభలో సీఎం ప్రకటించారని తెలిపారు. ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేస్తే ఉప్పరపల్లిలో ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వివరించారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయులు తరగతి గదిలో ఎక్కువ సమయం కేటాయించి, విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చి దిద్దుతారని, ఉపాధ్యాయుడి స్థానం గొప్పదని పేర్కొన్నారు. కుడా చైర్‌పర్సన్ గుండు సుధారాణి, కలెక్టర్ డాక్టర్ సత్యశారద మాట్లాడుతూ విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దే గొప్ప అవకాశం ఉపాధ్యాయులకే దక్కుతుందని చెప్పారు. అనంతరం 50 మంది ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, ఐదుగురు ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు అవార్డులు అందజేసి ఘనంగా సత్కరించారు. మేర కార్పొరేషన్ చైర్మన్ వెంకట్రాజం, అదనపు కలెక్టర్ వైవీ గణేశ్, డీఆర్డీఓ నాగపద్మజ, జెడ్పీ సీఈఓ వసంతకుమారి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మీసాల ప్రకాశ్, ఉపాధ్యాయులు డీపీఆర్‌ఓ ప్రేమలత, ఖిలా వరంగల్ తహసీల్దార్ ఇక్బాల్, సీఎంఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు
ఉపాధ్యాయ దినోత్సవంలో
వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
ఆకుతోట కన్వెన్షన్‌లో
55 మందికి అవార్డుల ప్రదానం,
హాజరైన ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ‘కుడా’ చైర్‌పర్సన్ గుండు సుధారాణి, కలెక్టర్ సత్యశారద, అధికారులు
పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల విద్యా వికాసానికి విశేష కృషి చేసిన ఉపాధ్యాయులను ఉత్తమ అవార్డులకు ఎంపిక చేస్తారు. ఇందుకు ముందుగా అర్హులైనవారినుంచి రెందు ప్రతుల నివేదిక తీసుకోవాలి. దీనిపై లోతుగా పరిశీలించాలి. కాగా, జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికలో పారదర్శకత లోపించిందని, అనర్హులను ఎంపిక చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వరంగల్ నగరంలోని లక్ష్మీపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని ఓ ఉపాధ్యాయుడి పేరు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు జాబితాలో ఉండడాన్ని గ్రహించిన ఒకరు కలెక్టర్ సత్యశారదకు శుక్రవారం రాత్రి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఆయన తోటి ఉపాధ్యాయురాలిని అవమానించారంటూ జనవరిలో ఫిర్యాదు చేయగా విచారణ ఎదుర్కొంటున్నట్లు తెలిసింది. చివరికి ఈ విషయం డీఈఓకు కలెక్టర్ చెప్పడంతో ఆ పేరును తొలగించారు.


