మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై చర్యలు | - | Sakshi
Sakshi News home page

మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై చర్యలు

Sep 4 2026 2:36 AM | Updated on Sep 4 2026 2:36 AM

మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై చర్యలు

వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఎన్‌.శ్వేత

వరంగల్‌ చౌరస్తా: మత్తు పదార్థాలకు బానిసై తమ భవిష్యత్‌ను అంధకారంలోకి నెట్టుకుంటున్న యువతను తిరిగి సాధారణ జీవితంలోకి తీసుకురావాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఎన్‌.శ్వేత కోరారు. వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో ఆధునికీకరించిన అడిక్షన్‌ ట్రీట్‌మెంట్‌ ఫెసిలిటీ (ఏటీఎఫ్‌) కేంద్రాన్ని గురువారం ఈగల్‌ ఫోర్స్‌ సహకారంతో పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, నిల్వ, విక్రయాలపై డ్రగ్స్‌ కంట్రోల్‌ టీం కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మత్తు పదార్థాల వ్యసనానికి సంబంధించిన ఏదైనా సాయం, సమాచారం లేదా మార్గదర్శకత్వం కోసం 87125 84473, 87126 85299 నంబర్లలో సంప్రదించాలని సీపీ సూచించారు. కార్యక్రమంలో ఈస్ట్‌ జోన్‌ డీసీపీ అంకిత్‌కుమార్‌, ఎంజీఎం సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కె.రాంకుమార్‌రెడ్డి, ఎస్‌బీ ఇన్‌చార్జ్‌ ఏసీపీ మధుసూదన్‌, డ్రగ్స్‌ కంట్రోల్‌ టీం ఇన్‌న్‌స్పెక్టర్‌ సాయిరాం, ఆర్‌ఐ శివకేశవులు, ఈగల్‌ టీం ఇన్‌స్పెక్టర్‌ రవీందర్‌, ఐటీ కోర్‌ ఇన్‌న్‌స్పెక్టర్‌ కిరణ్‌కుమార్‌, ఈగల్‌ టీం ఎస్‌ఐ శ్రీకాంత్‌, ఆర్‌ఎస్‌ఐలు పూర్ణ చందర్‌రెడ్డి, మనోజ్‌ రెడ్డి, నాగరాజు పాల్గొన్నారు.

భద్రకాళి బండ్‌ పనులు

త్వరగా పూర్తిచేయండి

వరంగల్‌ అర్బన్‌: ‘భద్రకాళి బండ్‌ అభివృద్ధి పనులు ఇంకా ఎన్నేళ్లు చేస్తారు’ అని గ్రేటర్‌ వరంగల్‌ కమిషనర్‌ టి.వెంకన్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్‌ నగరంలోని భద్రకాళి బండ్‌పై కొనసాగుతున్న అభివృద్ధి పనులను గురువారం ఆయన బల్దియా ఇంజనీరింగ్‌, ‘కుడా’ అధికారులతో కలిసి బండ్‌పై కొనసాగుతున్న పనులు తనిఖీ చేశారు. బండ్‌పై నిర్మిస్తున్న టాయిలెట్లు, పరిసరాల సుందరీకరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

‘ఏఎన్‌ఎంలపై

పనిఒత్తిడి తగ్గించాలి’

గీసుకొండ: ఏఎన్‌ఎంలపై పనిఒత్తిడిని తగ్గించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తెలంగాణ యునైటెడ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.యాదానాయక్‌ డిమాండ్‌ చేశారు. ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం డీఎంహెచ్‌ఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం డీఎంహెచ్‌ఓ బి.రాజారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యాదానాయక్‌ మాట్లాడుతూ వైద్య, ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న రెగ్యులర్‌, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఏఎన్‌ఎంల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జిల్లపల్లి సుధాకర్‌, నాయకులు దాసరి నర్మద, సంధ్యారాణి, రాజేశ్వరి, బి.జ్యోతి, టి.విజయ, జయమణి, ఆర్‌.అనిత, పెనినా, చంద్రకళ, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో

మల్టీపర్పస్‌ వర్కర్‌ మృతి

నల్లబెల్లి: పండుగపూట ఆ ఇంటి ఆనందం ఆవిరైంది. కూతురు, అల్లుడితో కలిసి సంతోషంగా గడిపిన కొద్ది క్షణాల్లోనే జరిగిన రోడ్డు ప్రమాదం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఎస్సై మోడెం సాయి ప్రసన్నకుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. రేలకుంట గ్రామానికి చెందిన జూనూరి చిన్న రాజు (38) మల్టీపర్పస్‌ వర్కర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. గ్రామంలో బుధవారం పోచమ్మ బోనాలు నిర్వహించారు. మహ్మద్‌గౌస్‌పల్లిలో ఉండే తన కూతురు శైలజ, అల్లుడు శివను ఆయన ఇంటికి ఆహ్వానించాడు. కుటుంబ సభ్యులందరూ కలిసి వేడుకను ఘనంగా జరుపుకున్నారు. అందరూ కలిసి భోజనాలు చేసిన తర్వాత సాయంత్రం చిన్న రాజు స్వయంగా అల్లుడు, కూతురిని తన ద్విచక్రవాహనంపై ఎక్కించుకొని మహ్మద్‌గౌస్‌పల్లిలోని వారి నివాసంలో క్షేమంగా దింపాడు. అక్కడి నుంచి ఒంటరిగా తిరిగి ద్విచక్రవాహనంపై రేలకుంటకు బయలుదేరాడు. రేలకుంట శివారులోని కల్వర్టు వద్దకు చేరుకోగానే ఆయన ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం అదుపుతప్పింది. ఈ ప్రమాదంలో కిందపడిపోగా తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు రాత్రి 108 వాహనంలో ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. చిన్న రాజు మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఆయనకు భార్య ధనలక్ష్మి, కుమారుడు శశికాంత్‌ ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement