సంగెం: కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఉపాధ్యాయురాలిగా మారారు. మండలంలోని లోహిత ఎంపీపీఎస్‌ను గురువారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని 4, 5 తరగతుల విద్యార్థులలో ఆత్మీయంగా మమేకమై తెలుగు, ఇంగ్లిష్, గణితం బోధించారు. విద్యార్థుల అభ్యసనస్థాయిని పరిశీలించడంతోపాటు విద్యపై ఆసక్తిని పెంపొందించేలా డిక్టేషన్ పెట్టారు. విద్యార్థులు రాసిన జవాబు పత్రాలను మూల్యంకనం చేసి, బాగా రాసి మంచి మార్కులు సాధించిన వారికి స్టిక్కర్ అంటించి అభినందించారు. తరగతి గదిలో విద్యార్థులతో కలిసి కూర్చుని వారి చదువు తీరును పరిశీలించారు. పలు అంశాలు సులభంగా అర్థమయ్యేలా బోధించారు. విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి వారి సామర్థ్యాలను పరిశీలించారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్న భోజనం నాణ్యతగా ఉంటుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు క్రమం తప్పకుండా నిత్యం పాఠశాలకు హాజరుకావాలని సూచించారు. విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యాబోధన చేసి, వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసి సమగ్ర అభివృద్ధికి పాటుపడాలని ఉపాధ్యాయులు రజని, సునీతకు సూచించారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించి చిన్నారులతో ముచ్చటించారు. కలెక్టర్ స్వయంగా ఉపాధ్యాయురాలిగా మారి 45 నిమిషాల పాటు చేసిన బోధనను విద్యార్థులు ఎంతో ఆసక్తిగా విని, కలెక్టర్ అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పారు. డీబీసీ డీఓ పుష్పలత, ఉద్యానశాఖ అధికారి శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు.


