● కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్
ఐనవోలు: రెండు సర్వేలను వేగంగా, పకడ్బందీగా పూర్తి చేయాలని రెవెన్యూ, వ్యవసాయ అధికారులను హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ఆదేశించారు. భూరికార్డుల పారదర్శకత, కచ్చితత్వం కోసం చేపట్టిన భూముల రీ సర్వే, డిజిటల్ క్రాప్ సర్వే కార్యక్రమాలను కలెక్టర్ బుధవారం మండలంలోని పంథిని, చింతకుంటలో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈసందర్భంగా పంథిని గ్రామ పరిధిలో మొత్తం 3,541 ఎకరాలు ఉండగా, ఇప్పటి వరకు 2,144 ఎకరాల భూమికి రీ సర్వే పూర్తయినట్లు సర్వేయర్లు కలెక్టర్‌కు వివరించారు. రోవర్లతో సర్వేయర్లు భూమిని కొలుస్తున్న తీరును పరిశీలించి, ప్రస్తుత పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. రీ సర్వే బాగుందని భూహద్దులు, విస్తీర్ణం, పట్టాదారు వివరాల్లో స్పష్టత రానుందని, భవిష్యత్‌లో భూ సమస్యలు తగ్గుతాయని రైతులు రాజిరెడ్డి, రామరాజు, సంపత్‌రెడ్డి, సునీల్ రెడ్డి, మాధవి, సరోజన, నిర్మల ఆనందం వ్యక్తం చేశారు.
15 రోజుల్లో పూర్తి చేయాలి..
భూముల రీ సర్వేను మరో 15 రోజుల్లో పూర్తిచేయాలని సర్వేయర్లను కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ఆదేశించారు. రీ సర్వే వివరాలను ల్యాండ్ పార్సిల్ మ్యాప్ (ఎల్పీఎం)లో నమోదు ప్రక్రియను కూడా వెంటనే పూర్తి చేయాలన్నారు. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న డిజిటల్ క్రాప్ సర్వేను కలెక్టర్ పరిశీలించారు. సర్వే నంబర్ల వారీగా వివరాల నమోదు, జియో మ్యాపింగ్, పంటల ఫొటోల నమోదు, సాంకేతిక వ్యవస్థ పనితీరును పరిశీలించారు. కలెక్టర్ వెంట సర్పంచ్ శ్రీరామ్ భూపాల్, ఏడీఏ రాజ్‌కుమార్, ఆర్డీఓ వెంకటేశ్, జిల్లా భూముల కొలతల శాఖ ఏడీ నూర్ సింగ్, తహసీల్దార్ విక్రమ్‌కుమార్, ఏఓ సునీల్‌కుమార్, సర్వేయర్ సూరజ్, స్థానిక రైతులు పాల్గొన్నారు.


