నీట్‌ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు | - | Sakshi
Sakshi News home page

నీట్‌ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు

Aug 30 2026 1:39 AM | Updated on Aug 30 2026 1:39 AM

నీట్‌ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఎంబీఏ, ఎంసీఏలో ఖాళీ సీట్లకు స్పాట్‌ అడ్మిషన్లు దేవాదాయశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలి రేపు ముఖ గుర్తింపు హాజరు నమోదు అంగన్‌వాడీ కేంద్రాలకు ఉచిత విద్యుత్‌ వెలుగులు

వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ శ్వేత

వరంగల్‌ క్రైం: వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో ఆదివారం నిర్వహించే నీట్‌ పీజీ ప్రవేశ పరీక్ష 2026కు అయా పరీక్ష కేంద్రాల వద్ద ఉదయం 6నుంచి సాయంత్రం 6 గంటల వరకు సెక్షన్‌ 163 బీఎన్‌ఎస్‌ అమలులో ఉంటుందని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ శ్వేత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష కేంద్రాలకు 500 మీటర్ల దూరం వరకు ఐదుగురికి మించి గుంపులుగా ఉండరాదని సూచించారు. ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలకు, మైకులు, డీజేలతో ఊరేగింపులు, ధర్నాలు, ప్రచారాలు నిర్వహించరాదని పేర్కొన్నారు. పరీక్ష సమయంలో పరిసరాల్లోని ఇంటర్నెట్‌ సెంటర్లు, జిరాక్స్‌ షాపులు, స్టేషనరీ దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తుతోపాటు ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

కేయూ క్యాంపస్‌: హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల, మహిళా పీజీ కళాశాలలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ఖాళీ సీట్లకు స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు కళాశాలల ప్రిన్సిపాల్‌ ఎస్‌.జ్యోతి శనివారం తెలిపారు. ఆర్ట్స్‌ కళాశాలలో ఎంసీఏ, మహిళా పీజీ కళాశాలలో ఎంబీఏ, ఎంసీఏలో సీట్లు ఖాళీగా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. టీఎస్‌ ఐసెట్‌–2026లో ఉత్తీర్ణత సాధించిన, ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల కోసం ఆయా కళాశాలల్లో ఈనెల 31 నుంచి సెప్టెంబర్‌ 3 వరకు స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు వివరించారు. ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో హాజరై ఫీజు చెల్లించి ప్రవేశాలు పొందాలని సూచించారు. స్పాట్‌ అడ్మిషన్లలో ప్రవేశాలు పొందే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ స్కాలర్‌షిప్‌లు రావని తెలిపారు.

హన్మకొండ కల్చరల్‌: ఆలయాల ఆభరణాలు, భూముల విషయంలో దేవాదాయశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖ రీజినల్‌ జాయింట్‌ కమిషనర్‌ మల్లెల రామకృష్ణారావు ఆదేశించారు. ఈ మేరకు శనివారం హనుమకొండలోని వేయిస్తంభాల దేవాలయాన్ని మల్లెల రామకృష్ణారావు దంపతులు సందర్శించారు. ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, అర్చకులు, సిబ్బంది ఆయనను ఆలయ మర్యాదలతో స్వాగతించారు. రుద్రేశ్వరస్వామికి పూజలు చేసిన అనంతరం ఆయనకు అర్చకులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు అందజేశారు.

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో 16 పీరియడ్‌ల వర్క్‌లోడ్‌తో విధులు నిర్వర్తిస్తున్న పార్ట్‌టైం అధ్యాపకుల ముఖ గుర్తింపు హాజరు నమోదును సోమవారం చేపట్టనున్నట్లు రిజిస్ట్రార్‌ వి.రామచంద్రం తెలిపా రు. ఉదయం 10–30 నుంచి సాయంత్రం 5 గంటలవరకు యూనివర్సిటీ పరిపాలనా భవనంలోని సెనెట్‌హాల్‌లో నమోదు ఉంటుందని తెలిపారు. ప్రతి పార్ట్‌టైం అధ్యాపకుడు తప్పనిసరిగా ముఖ గుర్తింపు హాజరు కోసం నమోదు చేసుకోవాలని రిజిస్ట్రార్‌ కోరారు.

హన్మకొండ: వరంగల్‌ సర్కిల్‌ పరిధిలో 919, హనుమకొండ సర్కిల్‌ పరిధిలో 98 అంగన్‌వాడీ కేంద్రాలకు ఉచితంగా విద్యుత్‌ కనెక్షన్‌ అందించినట్లు ఆయా సర్కిళ్ల ఎస్‌ఈలు ఎ.అనందం, బి.సామ్యానాయక్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఫ్యాన్లు, లైట్లు, తాగునీటి మోటార్లు, ఇతర విద్యుత్‌ పరికరాలు వినియోగించుకునే అవకాశం ఏర్పడిందని పేర్కొన్నారు. చిన్నారులు వేడి, ఉక్కపోత వంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యవంతమైన వాతావరణంలో ఉండొచ్చని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement