వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండను స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా అడుగులు పడుతున్నాయని, క్రీడాకారులు త్వరలోనే తీపి కబురు వింటారని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని హనుమకొండ బాలసముద్రంలో పునర్నిర్మించిన స్విమ్మింగ్‌పూల్, జేఎన్ ఇండోర్ స్టేడియంలోని షటిల్ బ్యాడ్మింటన్ కోర్టులను శనివారం ఎంపీ కడియం కావ్య, కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం ఇండోర్‌స్టేడియంలో హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ స్పోర్ట్స్ స్కూల్‌కు సొంత భవనం నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఏసీపీ జితేందర్‌రెడ్డి, హనుమకొండ డీవైఎస్‌ఓ కొత్త ప్రశాంత్, తెలంగాణ జూడో అసోసియేషన్ బాధ్యుడు బి.కైలాశ్‌యాదవ్, వాలీబాల్ సంఘం రాష్ట్ర బాధ్యుడు మర్కాల యాదిరెడ్డి, వరంగల్ క్లబ్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్, బ్యాడ్మింటన్ సంఘం జిల్లా కార్యదర్శి రమేష్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, డీఎస్‌ఏ కోచ్‌లు పాల్గొన్నారు.
క్రీడల అధికారిపై కలెక్టర్ ఆగ్రహం..
ఇండోర్‌స్టేడియంలో ఏర్పాటు చేసిన సభా వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్ ఫొటో స్థానంలో మరో అధికారి ఫొటోను ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. వేదిక పైకి రాగానే ఫొటోను గమనించిన కలెక్టర్ అక్కడే ఉన్న డీవైఎస్‌ఓ ప్రశాంత్‌ను పిలిచి ఇదేంటని ప్రశ్నించారు. తనకు ఆ ఫొటోకు ఏమైనా సంబంధం ఉందా అంటూ సీరియస్ అయ్యారు. ఇదిలా ఉండగా ప్రారంభోత్సవ ఉపన్యాసం చేసిన బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పై అసహనం వ్యక్తం చేశారు. స్పోర్ట్స్ స్కూల్ పిల్లలు చాలాసేపు నుంచి నిలబడి ఉన్నారు, ప్రసంగాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
ఫ్లెక్సీలో ఎంపీ ఫొటో లేకపోవడంపై చర్చ..
ప్లెక్సీలో వరంగల్ ఎంపీ కడియం కావ్య ఫొటో లేకపోవడం చర్చకు దారి తీసింది. ఇండోర్ స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఫొటో లేదన్న విషయం తెలుసుకుని స్విమ్మింగ్ పూల్ వద్దకు వచ్చిన ఎంపీ కావ్య స్టేడియం ప్రారంభోత్సవానికి రాకుండానే వెళ్లిపోయారు.
పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి


