హన్మకొండ : ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని రేవంత్ సర్కార్ నీరుగారుస్తోందని బీజేపీ నాయకులు ధ్వజమెత్తారు. ‘ఫీజుల బకాయి–బీజేపీ లడాయి’లో భాగంగా విద్యార్థుల భవిష్యత్ కోసం, పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో శనివారం హనుమకొండ బాలసముద్రంలోని ఏకశిల పార్కు వద్ద ఒక రోజు నిరాహార దీక్ష చేశారు. ఈ దీక్షను బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మ, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం రూ.15వేల కోట్ల బకాయిలు చెల్లించకపోవడంతో కళాశాల యాజమాన్యాలు విద్యార్థుల సర్టిఫికెట్లను నిలిపివేస్తున్నాయని, దీంతో వేల మంది విద్యార్థులు చేతికి వచ్చిన ఉద్యోగ అవకాశాలను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ వేదికగా జెన్ జడ్ విద్యార్థుల భవిష్యత్ గురించి గొప్పలు చెప్పే రాహుల్ గాంధీ.. తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో రోడ్డున పడ్డ విద్యార్థుల గోడును ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. నిరాహార దీక్షలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పున్నం వేణు, నాయకులు డాక్టర్ పగడాల కాళీప్రసాద్, చాడ స్వాతి, పెసరు విజయ్‌చందర్ రెడ్డి, రావుల కిషన్, ఆర్పీ జయంతి లాల్, కందగట్ల సత్యనారాయణ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


