సాక్షి ప్రతినిధి, వరంగల్:
ఒక అసిస్టెంట్ డైరెక్టర్..
12 జిల్లాల పర్యవేక్షణకు ఇన్‌చార్జ్..
భూపాలపల్లి మైన్స్ ఏడీగా పనిచేసి గురువారం ఏసీబీ దాడులకు గురైన బొజ్జ జయరాజు ములుగు జిల్లా మైన్స్ బాధ్యతల్లోనూ కొద్ది రోజులు ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. 2024 మార్చి 15న భూపాలపల్లి ఏడీగా వచ్చిన ఆయన 2025 అక్టోబర్ 8న వరంగల్ రీజియన్ (ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం)కు డిప్యూటీ డైరెక్టర్‌గా ఇన్‌చార్జ్ బాధ్యతల్లోకి వచ్చారు. రాజకీయ పలుకుబడి, ఉన్నతాధికారుల అండదండలతోనే ఈ అదనపు బాధ్యతలు దక్కాయన్న ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. దీంతో ఏడీతోపాటు పూర్వ వరంగల్, కరీంనగర్, ఖమ్మంలకు చెందిన 12 జిల్లాల మైనింగ్ పర్యవేక్షణ బాధ్యతలు కూడా డీడీగా ఈయనకే. ఇదిలా ఉండగా ఉమ్మడి వరంగల్‌లో ఏడీలకు వరంగల్, హనుమకొండలకు చాలాకాలం ఒక్కరే ఏడీగా బాధ్యతలు నిర్వహించారు. భూపాలపల్లి, ములుగులకు కూడా ఒక్కరే ఉన్నారు. ఇటీవల హనుమకొండకు పూర్తి కాలపు ఏడీ రాగా, మిగతా చోట్ల హెడ్ ఆఫీసు కనుసన్నల్లో ఉండే ఏజీలను ఏడీలుగా నియమించారంటే గనులశాఖలో పోస్టింగ్‌ల తీరును అర్థం చేసుకోవచ్చు.
‘మినరల్స్’ ఉన్న చోటే ఎందుకీ ఆసక్తి?
ఉమ్మడి వరంగల్‌లోని అన్ని జిల్లాల్లో ఖనిజ వనరులు ఒకే రకంగా లేవు. భూపాలపల్లి, ములుగు ప్రాంతాల్లో గోదావరి పరీవాహక ప్రాంతం కారణంగా ఇసుక కార్యకలాపాలకు ప్రాధాన్యం ఉండగా.. ఇతర జిల్లాల్లో గ్రానైట్, బిల్డింగ్ స్టోన్, రోడ్ మెటల్, లేటరైట్, ఇతర ఖనిజాల తవ్వకాలు జరుగుతున్నాయి. మహబూబాబాద్‌లో ఇనుప ఖనిజం, లేటరైట్‌తోపాటు బ్లాక్, కలర్ గ్రానైట్, బిల్డింగ్ స్టోన్, రోడ్ మెటల్, ఎర్త్, గ్రావెల్ వంటి ఖనిజాలు ఉన్నట్లు అధికారిక మైన్స్ శాఖ వివరాలు చెబుతున్నాయి. అక్కడ 168 బ్లాక్ గ్రానైట్ మైనర్ మినరల్ లీజులు నమోదై ఉండగా.. 66 పనిచేస్తున్నట్లు జిల్లా శాఖ వివరాలు పేర్కొంటోంది. అందుకే ఖనిజ వనరులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మైన్స్ అధికారుల పోస్టింగులు సహజంగానే ప్రాధాన్యం సంతరించుకుంటాయి. ఈ నేపథ్యంలోనే మినరల్స్ బాగా ఉన్న ‘మంచి పోస్టింగ్’ల కోసం పైరవీలు చేసుకుని వస్తున్నట్లు ప్రచారం ఉంది. వారికి రాజకీయ పలుకుబడి, ఉన్నతస్థాయి అండదండలు పుష్కలంగా ఉంటాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో మీడియాకు కూడా శాఖాపరమైన సమాచారం ఇవ్వకుండా ‘టూర్’ల పేరిట తప్పుకున్న సందర్భాలు పలుసార్లు విమర్శలకు దారి తీశాయి. కాగా, ఇటీవల ఏసీబీ దాడులు, అక్రమాస్తుల కేసులు వెలుగులోకి వస్తుండడంతో మైనింగ్ శాఖలో అధికారుల పోస్టింగులు, వారి పనితీరుపై మరోసారి చర్చ మొదలైంది.
గనులశాఖలో కొందరు
అధికారుల తీరిది
పొలిటికల్ అండ, ఉన్నతాధికారుల సపోర్టు
ఒక్కొక్కరికీ రెండేసి జిల్లాలు..
ఏడీలకు డీడీ బాధ్యతలు
ఆదాయానికి మించిన ఆస్తులు..
అక్రమ వ్యాపారులతో చెట్టాపట్టాల్
ఏసీబీ సోదాలతో మళ్లీ చర్చకు వచ్చిన పోస్టింగ్‌ల దందా
ఆరు జిల్లాల్లో.. మూడుచోట్ల ఇన్‌చార్జ్‌లే..
ఆగస్టు 2026లో ఆయా జిల్లాల అధికారిక వెబ్‌సైట్లలో కనిపిస్తున్న వివరాలను పరిశీలిస్తే ఉమ్మడి వరంగల్‌లోని ఆరు జిల్లాల్లో మూడు చోట్ల ఇన్‌చార్జ్ వ్యవస్థ కనిపిస్తోంది.
హనుమకొండ జిల్లాలో ఏడీ బాధ్యతలు ఇన్‌చార్జ్‌కి ఉండగా ఇటీవల రెగ్యులర్ ఏడీని నియమించారు.
వరంగల్‌లో రెగ్యులర్ ఏడీ ఉన్నట్లు జిల్లా వెబ్‌సైట్ పేర్కొంటోంది. జనగామలో జిల్లా వెబ్‌సైట్, కేంద్ర మైన్స్ శాఖ డేటాలో అధికారి హోదాకు సంబంధించి వ్యత్యాసం కనిపిస్తోంది. ఇక్కడ కూడా అసిస్టెంట్ జియాలజిస్టు(ఏజీ)నే ఇన్‌చార్జ్ ఏడీగా నియమించినట్లు తెలిసింది.
మహబూబాబాద్‌లో రెగ్యులర్ ఏడీ ఉన్నారు.
భూపాలపల్లిలో డిప్యూటీ డైరెక్టర్ స్థాయి అధికారి ఇన్‌చార్జి ఏడీగా ఉన్నారు. ఆయన (బి.జయరాజు) గురువారం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీకి చిక్కారు.
ఇందులో కొన్ని చోట్ల అసిస్టెంట్ జియాలజిస్ట్‌లు ఇన్‌చార్జ్ అసిస్టెంట్ డైరెక్టర్లుగా పోస్టింగ్‌లు తెచ్చుకున్నారు.
ములుగులో ఇన్‌చార్జ్ ఏడీగా ఉన్న అసిస్టెంట్ జియాలజిస్ట్ భద్రాద్రి కొత్తగూడెం ఇన్‌చార్జ్ ఏడీగా కూడా వ్యవహరిస్తున్నారు.


