నల్లబెల్లి: గ్రామీణ ప్రాంతాల్లో జాబ్‌కార్డు కలిగి ఉన్న ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 125 రోజులు పని కల్పించాలనే లక్ష్యంతో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి ఏళ్ల తరబడి ఉద్యోగ భద్రత కరువైంది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ స్థానంలో కేంద్ర ప్రభుత్వం వీబీజీ రాం జీ (వికసిత్ భారత్–గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్) చట్టాన్ని తీసుకొచ్చింది. ఇందులో పనిచేస్తున్న క్షేత్రస్థాయి, సాంకేతిక సిబ్బంది పనిభారంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న 78 మందికి ఉద్యోగ భద్రత కరువైంది. పేస్కేల్ అమలుపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కను కలిసి సిబ్బంది ఇటీవల విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలు, ఆకాంక్షలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు పేస్కేల్ ప్రకటించి, తమ జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని కోరారు. ఎన్నో ఏళ్లుగా ఈ పథకంలో సేవలందిస్తున్న సాంకేతిక సహాయకులు తగిన గుర్తింపు, ఉద్యోగ భద్రత కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. సమస్యలపై చర్చించి పేస్కేల్ వర్తింపజేస్తామని ప్రభుత్వం భరోసా కల్పించింది. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చించి పేస్కేల్ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వంపై ఎంతభారం పడినా వెనక్కి తగ్గేదిలేదని మంత్రి సీతక్క వారికి భరోసా కల్పించారు. కాగా, ఇటీవల పెండింగ్‌లో ఉన్న వేతన బకాయిలను ప్రభుత్వం విడుదల చేసినా.. ఆ హామీ నేటికి నెరవేరలేదని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిరకాల డిమాండ్ అయినా పేస్కేల్ ప్రకటన కోసం సిబ్బంది ఎదురు చూస్తున్నామని, చాలీచాలని వేతనాలతో కుటుంబ పోషణ భారంగా మారుతోందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి పేస్కేల్ అమలు చేయాలని వీబీజీ రాం జీ సిబ్బంది కోరుతున్నారు.
జిల్లాలో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు..
ఏపీఎంలు 11
సీఓ, ఏఏలు 22
ఈసీలు 7
జేఈలు 3
డీబీటీఎం 1
టీఏలు 34
సంవత్సరాలుగా వీబీజీ రాంజీ సిబ్బంది ఎదురుచూపులు
చాలీచాలని జీతాలతో కుటుంబ
పోషణకు ఇబ్బందులు


