కాశిబుగ్గ: హనుమకొండ జిల్లా కాకతీయ వైద్యకళాశాల కార్యాలయంలోని వీఆర్‌డీఎల్ పథకం కింద ఆరోగ్య పరిశోధన శాఖలో ఒక సైంటిస్ట్–బీ (మెడికల్) పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్న ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్‌దాసు ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను ఈ నెల 31 నుంచి www.kmcwgl.com వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ దరఖాస్తులను పూర్తి చేసి, అవసరమైన ధ్రువపత్రాలను జతచేసి కేఎంసీ కార్యాలయంలో సెప్టెంబర్ 9వరకు సమర్పించాలని పేర్కొన్నారు. హనుమకొండ కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటు చేయనున్న జిల్లా కమిటీ ద్వారా ఎంపిక చేస్తారని పేర్కొన్నారు. ఈ పోస్టు 11 నెలల కాలానికి గాని, అభ్యర్థి సంతృప్తికరమైన పనితీరు, ప్రాజెక్టు కొనసాగింపును బట్టి పొడిగించే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు.
31 నుంచి కేయూలో
ఎంబీఏ స్పాట్ అడ్మిషన్లు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ కళాశాలలో ఈ విద్యాసంవత్సరం (2026–2027) ఎంబీఏ కోర్సులో ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించనున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.నర్సింహాచారి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ స్పాట్ అడ్మిషన్లు ఈనెల 31నుంచి సెప్టెంబర్ 3వ తేదీ వరకు ఉంటాయన్నారు. టీఎస్‌ఐసెట్–2026లో అర్హత సాధించిన అభ్యర్థులతో పాటు అర్హత సాఽధించని వారు కూడా హాజరుకావొచ్చునని తెలిపారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ ధ్రువపత్రాలతో పాటు అవసరమైన ఫీజు తీసుకురావాలని ఆయన సూచించారు. స్పాట్ అడ్మిషన్ల ద్వారా ఎంబీఏ కోర్సులో ప్రవేశాలు పొందే అభ్యర్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులు కాదని పేర్కొన్నారు. మార్గదర్శకాలు టీజీఐసెట్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు కాకతీయ యూనివర్సిటీలోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ కళాశాల నోటీస్ బోర్డులో ఉంచామని ప్రిన్సిపాల్ నర్సింహాచారి వివరించారు.
స్కూల్ ఆఫ్ లెర్నింగ్‌లోనూ..
కాకతీయ యూనివర్సిటీలోని దూరవిద్య కేంద్రంలోని స్కూల్ ఆఫ్ లెర్నింగ్ (కేయూ ఎస్‌ఎల్)లో ఈ విద్యాసంవత్సరానికి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించనున్నట్లు దూరవిద్య కేంద్రం డైరెక్టర్ బి.సురేశ్‌లాల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టీజీఐసెట్–2026 అర్హత సాధించిన, అర్హత సాధించని అభ్యర్థులు కూడా తమతమ సర్టిఫికెట్లతో ఈనెల 31నుంచి సెప్టెంబర్ 3వరకు హాజరై ప్రవేశాలు పొందవచ్చని తెలిపారు.
నిట్‌లో తెలుగు భాషా దినోత్సవం
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్‌ని కెమికల్ ఇంజనీరింగ్ విభాగం సెమినార్ హాల్‌లో శుక్రవారం తెలుగు భాషా దినోత్సవం నిర్వహించారు. స్టూడెంట్స్ యాక్టివిటీస్ సెంటర్ అధ్యక్షుడు ప్రొఫెసర్ వెలగపూడి వాసు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ మార్క శంకర్ మాట్లాడుతూ.. నాడు గ్రంథాల్లో అచ్చమైన తెలుగు ఉండాలని గిడుగు రామ్మూర్తి పోరాడారని గుర్తు చేశారు. తెలుగు భాష కమ్మనైనది అనే పాటను ప్రొఫెసర్ వెలగపూడి వాసు ఆలపించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు సోమశేఖర్, రాజమోహన్, సూర్యనారాయణ, విద్యార్థులు పాల్గొన్నారు.
తీజ్ వేడుకల్లో విషాదం
బైక్ ఢీకొని వ్యక్తి దుర్మరణం
రాయపర్తి: తీజ్ వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. ఎస్సై ముత్యం రాజేందర్ కథనం ప్రకారం.. పర్వతగిరి మండలం గోరుగుట్టతండాకు చెందిన బానోత్ రవి (48) తన అత్తగారి గ్రామం ఏకేతండాలో ఈనెల 27న నిర్వహించిన తీజ్ వేడుకలకు హాజరయ్యాడు. తీజ్ ఊరేగింపులో భాగంగా దుర్గమ్మ ఆలయం వద్ద నిల్చున్నాడు. ఏకేతండాకు చెందిన హలావత్ నితిన్ తన బైక్‌తో అజాగ్రత్తగా అతివేగంగా ఢీకొట్టడంతో రవికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం 108 వాహనంలో వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించేలోగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడి కుమారుడు నరేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, శవపంచనామా నిర్వహించినట్లు ఎస్సై తెలిపారు.


