తల్లి మరణం తట్టుకోలేక.. | - | Sakshi
Sakshi News home page

తల్లి మరణం తట్టుకోలేక..

Aug 29 2026 2:04 AM | Updated on Aug 29 2026 2:04 AM

కుమారుడి మృతి

ఐనవోలులో ఘటన

ఐనవోలు: తల్లి మరణం తట్టుకోలేక కుమారుడు మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన ఐనవోలులో చోటు చేసుకుంది. స్థానికులు, బంధువుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కొండేటి మల్లికాంబ(65) కొంతకాలంగా అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతోంది. ఈ క్రమంలో ఎంజీఎంలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతిచెందగా మృతదేహాన్ని అర్ధరాత్రి స్వగ్రామం తీసుకొచ్చారు. మల్లికాంబకు ఇద్దరు కుమారులు సమ్మయ్య, రవి ఉన్నారు. రవి(32) కూడా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తల్లి మృతితో రాత్రంతా ఏడుస్తూ మనోవేదనకు గురై అస్వస్థతకు గురయ్యాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం తల్లికి అంత్యక్రియలు చేపట్టడానికి శ్మశానవాటిక వద్దకు ఆటోలో వెళ్లి కర్రవేసి వచ్చాడు. అతను నడి చే పరిస్థితి లేక పోవడంతో రవి కుమారుడు దక్షిత్‌తో మల్లికాంబతో అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబీకులు నిర్ణయించారు. మల్లికాంబ అంతిమయాత్ర చేపడుతుండగా మార్గమధ్యలో రవి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం రావడంతో కొందరు బంధువులు ఇంటికి చేరుకోగా అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా అప్పటికే మృతిచెందినట్లు అంబులెన్స్‌ సిబ్బంది నిర్ధారించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. నానమ్మ మల్లికాంబ అంత్యక్రియలు పూర్తి చేసుకుని ఇంటికి చేరుకున్న దక్షిత్‌.. తండ్రి రవి మృతదేహాన్ని చూసి బోరున విలపించాడు. అనంతరం తండ్రివి కూడా అంత్యక్రియలు నిర్వహించాడు. కాగా, తల్లి, కుమారుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, మల్లికాంబ గతంలో, రవి ప్రస్తుతం గ్రామ పంచాయతీ సిబ్బందిగా విధులు నిర్వర్తిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement