‘ఆప్షన్‌’ ఉద్యోగుల్లో ఆశలు | - | Sakshi
Sakshi News home page

‘ఆప్షన్‌’ ఉద్యోగుల్లో ఆశలు

Jul 13 2026 4:31 AM | Updated on Jul 13 2026 4:31 AM

హన్మకొండ: రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న మూడో డిస్కం తెలంగాణ రైతు పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌ (టీజీఆర్‌పీడీసీఎల్‌)కు వెళ్లేందుకు ముందుకు వచ్చిన విద్యుత్‌ ఉద్యోగుల్లో ఆశలు చిగురించాయి. మేలో పూర్తి కావాల్సిన బదిలీ నియామక ప్రక్రియ వివిధ కారణాలతో నిలిచిపోయింది. పలు అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో.. టీజీ ఆర్‌పీడీసీఎల్‌కు లైసెన్స్‌ మంజూరు తర్వాతనే బదిలీ నియామక ప్రక్రియ చేపట్టాలని యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. అయితే, బహిరంగ విచారణ నిర్వహించిన తెలంగాణ ఈఆర్‌సీ వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి, ప్రభుత్వానికి పలు కండీషన్లు పెట్టి ఎట్టకేలకు ఈనెల 10వ తేదీతో లైసెన్స్‌ జారీ చేసింది. మూడో డిస్కంలోకి ప్రస్తుతమున్న టీజీ జెన్‌కో, టీజీ ట్రాన్స్‌కో, టీజీ ఎస్పీపీడీసీఎల్‌, టీజీ ఎన్పీడీసీఎల్‌ నుంచి ఆసక్తి కనబర్చే అధికారులు, ఉద్యోగులను తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు నాలుగు విద్యుత్‌ సంస్థల నుంచి ఆసక్తి కనబర్చే ఉద్యోగులు, అధికారుల నుంచి ఆప్షన్లు అడిగారు.

పదోన్నతి కల్పిస్తామనడంతో వెళ్లేందుకు పోటీ..

ముందుగా కొత్త డిస్కం ఎలా ఉంటుంది.. వెళ్లాలా వద్దా? అని మల్లగుల్లాలు పడిన ఇంజనీర్లు, ఇతర అధికారులు, ఉద్యోగులు చివరకు పెద్ద ఎత్తున స్పందించారు. పదోన్నతి కల్పిస్తామని జీఓలో పేర్కొనడంతో.. ప్రస్తుతం పనిచేస్తున్న డిస్కంలో ఇప్పట్లో పదోన్నతి రాదు అని భావించిన అధికారులు, ఉద్యోగులు, ఆర్టిజన్లు ఆర్‌పీడీసీఎల్‌కు వెళ్లేందుకు పోటీపడ్డారు. ఏప్రిల్‌ 30 నుంచి మే 8 వరకు ఆసక్తి కలిగిన అధికారులు, ఉద్యోగుల నుంచి సమ్మతి కోరింది. టీజీ ఆర్‌పీడీసీఎల్‌కు మొత్తం 2,000 మంది అధికారులు, ఉద్యోగులు అవసరమని జీఓలో పేర్కొంది. రాష్ట్రంలోని టీజీ జెన్‌కో, టీజీ ట్రాన్స్‌కో, టీజీ ఎన్పీడీసీఎల్‌, టీజీ ఎస్పీడీసీఎల్‌కు చెందిన ఉద్యోగుల నుంచి ఆప్షన్లు కోరారు. దీంతో ఒక్క టీజీ ఎన్పీడీసీఎల్‌ నుంచి 1,252 మంది ఆప్షన్లు ఇచ్చారు. ఇతర డిస్కంల్లోను ఇదే పోటీ నెలకొందని విద్యుత్‌ ఉద్యోగులు తెలిపారు. ఆప్షన్‌లో పొందుపరిచిన వివరాలు... వాస్తవ వివరాలు సరి చూసి జాబితాను మూడో డిస్కంకు పంపారు. మేలోనే బదిలీ నియామక ప్రక్రియ పూర్తి చేసేలా షెడ్యూల్‌ ప్రకటించిన టీజీ ఆర్‌పీడీసీఎల్‌ తర్వాత వెనక్కి తగ్గింది. మే 13 నుంచి 19 వరకు బదిలీ ఉత్తర్వులు, జాయినింగ్‌, పోస్టింగ్‌ పూర్తి అయ్యేలా ఖరారు చేసినా చివరకు ప్రక్రియ నిలిచిపోయింది. అనంతరం ఈఆర్‌సీ లైసెన్స్‌ మంజూరు చేసి తర్వాతే బదిలీ నియామక ప్రక్రియ చేపట్టనున్నట్లు ప్రచారం జరిగింది.

బదిలీల కోసం ఎదురుచూపులు..

టీజీ ఎన్పీడీసీఎల్‌ నుంచి మొత్తం 1,252 మంది ఆర్‌పీడీఎల్‌కు వెళ్లేందుకు ఆప్షన్లు ఇచ్చారు. ఇందులో జూనియర్‌ లైన్‌మెన్లు 16 మంది, అసిస్టెంట్‌ లైన్‌మెన్లు 271 మంది, లైన్‌మెన్లు 116, లైన్‌ ఇన్‌స్పెక్టర్లు 31, సీనియర్‌ ఇన్‌స్పెక్టర్లు 4, ఫోర్‌మెన్లు 2, అసిస్టెంట్‌ ఇంజనీర్స్‌ 115, అడిషనల్‌ అసిస్టెంట్‌ ఇంజనీర్లు 61, అసిస్టెంట్‌ డివిజనల్‌ ఇంజనీర్లు 59, డివిజనల్‌ ఇంజనీర్లు 28, సూపరింటెండెంట్‌ ఇంజనీర్లు 4, ఒక చీఫ్‌ ఇంజనీర్‌, సబ్‌ ఇంజనీర్స్‌ 265, జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్స్‌ 66, ఆసిస్టెంట్‌ అకౌంట్స్‌ ఆఫీసర్స్‌ 10, అకౌంట్స్‌ ఆఫీసర్స్‌ 5, సీనియర్‌ అసిస్టెంట్లు 50, జూనియర్‌ అసిస్టెంట్లు 20, జూనియర్‌ పర్సనల్‌ ఆఫీసర్స్‌ 15, పర్సనల్‌ ఆఫీసర్స్‌ 2, ఆర్టిజన్‌ గ్రేడ్‌కు చెందిన వారు 5, ఆర్టిజన్‌ గ్రేడ్‌–3కి చెందిన వారు ఆరుగురు, ఒక్కరు ఆర్టిజన్‌ గ్రేడ్‌– 4, ఒక్క రికార్డు అసిస్టెంట్‌, ఒక్క సివిల్‌ ఈఈ దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. టీజీ ఆర్‌పీడీసీఎల్‌కు లైసెన్స్‌ రావడంతో మరోసారి ఆప్షన్లు ఇచ్చిన వారు పదోన్నతి లభిస్తుందనే సంతోషంలో ఉన్నారు. బదిలీ నియామక ప్రక్రియ ఎప్పుడు చేపడతారోనని అధికారులు, ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

టీజీఆర్‌పీడీసీఎల్‌కు కావాల్సిన ఉద్యోగులు 2,000

ఒక్క టీజీ ఎన్పీడీసీఎల్‌ నుంచి 1252 మంది దరఖాస్తు

మేలో బదిలీ ఉత్తర్వులు వెలువడాల్సి ఉండగా నిలిచిన ప్రక్రియ

ఎట్టకేలకు డిస్కంకు లైసెన్స్‌ జారీ.. బదిలీలకు ఎదురుచూపులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement