గ్యాస్‌ బుక్‌ చేస్తారు! | - | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ బుక్‌ చేస్తారు!

Mar 16 2026 8:38 AM | Updated on Mar 16 2026 8:38 AM

సిలిండర్ల డిమాండ్‌ నేపథ్యంలో సైబర్‌ నేరగాళ్ల ఎత్తుగడలు

గ్యాస్‌ కనెక్షన్‌ కేవైసీ అప్‌డేట్‌, అత్యవసర గ్యాస్‌ బుకింగ్‌తో ఎర

వాట్సాప్‌, ఎస్‌ఎంఎస్‌ లింక్‌లతో ప్రమాదమే

సామాజిక మాద్యమాల్లో చక్కర్లు కొడుతున్న లింక్‌లు

ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న సైబర్‌ క్రైమ్‌ పోలీసులు

సాక్షి, వరంగల్‌: ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకొని సైబర్‌ నేరగాళ్లు దూకుడు ప్రదర్శిస్తున్నారు. యుద్ధం ప్రభావంతో జిల్లాలో గ్యాస్‌ సిలిండర్ల కొరత ఏర్పడుతుందన్న వార్తలను నేరానికి పెట్టుబడిగా పెడుతున్నారు. గ్యాస్‌ సిలిండర్ల డిమాండ్‌ పెరుగుతున్న పరిస్థితిని ఆసరాగా చేసుకొని గ్యాస్‌ కనెక్షన్‌ కేవైసీ అప్‌డేట్‌, అత్యవసర గ్యాస్‌ బుకింగ్‌ పేరుతో సామాజిక మాద్యమాల్లో పోస్టులు పెడుతూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. ఈ తరహా వాట్సాప్‌ పోస్టులు, ఎస్‌ఎంఎస్‌లు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని సెల్‌ఫోన్‌ వినియోగదారులకు వెళ్తుండడంతో అప్రమత్తంగా ఉండాలని వరంగల్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సూచిస్తున్నారు.

లింక్‌లు పంపి...పైసలు కొల్లగొట్టేలా...

గ్యాస్‌ కనెక్షన్‌ కేవైసీ అప్‌డేట్‌ చేయాలంటూ వాట్సాప్‌, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా వచ్చే గుర్తు తెలియని లింకులను క్లిక్‌ చేయడం, వారు పంపే ఏపీకే ఫైల్స్‌ను మొబైల్‌లో డౌన్‌లోడ్‌ చేయడం అత్యంత ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. నేరగాళ్లు పంపే యాప్‌ డౌన్‌లోడ్‌ చేస్తే మొబైల్‌ నియంత్రణ అంతా వారి ఆధీనంలోకి వెళ్లడం ద్వారా ఫోన్‌కు వచ్చే బ్యాంక్‌ ఓటీపీలు, రహస్య సందేశాలు నేరుగా వారి చేతుల్లోకి వెళ్లిపోతాయి. ఖాతాలో డబ్బు ఖాళీ అవుతుందని హెచ్చరిస్తున్నారు.

ఇటీవల సోషల్‌ మీడియా వేదికలో ‘అత్యవసర గ్యాస్‌ బుకింగ్‌’, ‘తక్షణ డెలివరీ’ పేరుతో నకిలీ ప్రకటనలు విస్త్తృ తంగా కనిపిస్తున్నాయి. వినియోగదారులను ఆకర్షించేందుకు తక్కువ ధరకు గ్యాస్‌ సిలిండర్‌ అందిస్తామని, వెంటనే బుకింగ్‌ చేసుకునే ప్రత్యేక లింక్‌ ఇచ్చినట్లు చూపిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. లింక్‌పై క్లిక్‌ చేసిన తర్వాత మొబైల్‌లో ఏపీకే ఫైల్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచిస్తారు. అలాంటి ఫైల్స్‌ను ఇన్‌స్టాల్‌ చేస్తే మొబైల్‌లోని బ్యాంకింగ్‌, వ్యక్తిగత వివరాలు హ్యాకర్లకు వెళ్లే ప్రమాదం ఉంది. ముందుగా డబ్బు చెల్లిస్తే గ్యాస్‌ వస్తుందంటూ సందేశాలు వస్తే అది సైబర్‌ మోసమని గ్రహించాలి.

1930కి ఫిర్యాదు చేయండి

సాధారణంగా గ్యాస్‌ బుకింగ్‌, కేవైసీ అప్‌డేట్‌ వంటి ప్రక్రియలను ఆయా గ్యాస్‌ కంపెనీల అధికారిక వెబ్‌సైట్లు లేదా అధికారిక మొబైల్‌ యాప్‌ల ద్వారానే చేయాలి. గుర్తు తెలియని లింకులు, సందేశాలను నమ్మి వ్యక్తిగత వివరాలు, ఓటీపీలు ఇవ్వకూడదు. గ్యాస్‌ బుకింగ్‌, కేవైసీ అప్‌డేట్‌ వంటి వాట్సాప్‌ సందేశాలు, ఎస్‌ఎంఎస్‌లు వస్తే నేరుగా సంబంధింత గ్యాస్‌ ఏజెన్సీ కార్యాలయానికి వెళ్లి సంప్రదించండి. ఒకవేళ ఎవరైనా సైబర్‌ మోసాలకు గురైతే వెంటనే జాతీయ సైబర్‌ క్రైమ్‌ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1930కి కాల్‌ చేయండి. పోలీసులకు సమాచారం ఇవ్వాలి. తక్షణ ఫిర్యాదు ద్వారా ఆ నగదు రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది.

– గిరి కుమార్‌, ఏసీపీ, సైబర్‌ క్రైమ్‌, వరంగల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement