● హనుమకొండడీఎంహెచ్‌ఓ అప్పయ్య
ఎంజీఎం: బాలికలకు తప్పనిసరిగా హెచ్‌పీవీ టీకాలు ఇప్పించాలని హనుమకొండ వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా జరిపిన అధ్యయనాల్లో గర్భాశయ క్యాన్సర్‌ను నివారించడంలో 93 నుంచి 100 శాతం సామర్థ్యంతో హెచ్‌పీవీ టీకాలు అత్యంత ప్రభావంతంగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రైవేట్‌లో దాదాపు రూ.4వేల ఖరీదైన ఈ వ్యాక్సిన్ ప్రస్తుతం ఉచితంగా ఇస్తున్నారని తెలిపారు. 14వ పుట్టినరోజు జరుపుకొని 15వ పుట్టినరోజు ఇంకా చేసుకో ని వారు ఈ టీకాలు వేసుకునేందుకు అర్హులని వివరించారు. ఈ టీకాలతో ఎలాంటి తీవ్రమైన దుష్ప్రభావాలు ఉండవని, ఇతర టీకాల మాదిరిగా కొందరిలో ఇంజక్షన్ చేసిన ప్రదేశంలో నొప్పి, వాపు, జ్వరం ఉండవచ్చని, ఇవన్నీ రెండు మూడు రోజుల్లో తగ్గిపోతాయన్నారు. హెచ్‌పీవీ టీకా సంతానోత్పత్తిని ఏ విధంగా ప్రభావితం చేయదని, వాస్తవానికి గర్భాశయ క్యాన్సర్‌కు కారణమయ్యే, హెచ్‌పీవీ వ్యాధులకు సంబంధించిన ఇన్ఫెక్షన్‌ను నివారించడం ద్వారా సంతానోత్పత్తికి సహాయపడుతుందని వివరించారు. హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఇవ్వడానికి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి అని, అలాగే వారి సమక్షంలో వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు చెప్పారు. హనుమకొండ జిల్లాలో ప్రస్తుతం హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి, పరకాల సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు టీకాలు ఇస్తున్నట్లు తెలిపారు. వ్యాక్సినేషన్ తర్వాత సర్టిఫికెట్ కూడా ఇవ్వనున్నట్లు వివరించారు.


