హన్మకొండ: అభివృద్ధిలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలుపుతానని ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. హనుమకొండలోని వడ్డేపల్లి ఎస్సీ కాలనీలో రూ.50 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీరోడ్డు, డ్రెయినేజీ పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. నియోజకవర్గంలోని ప్రతీ కాలనీలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని, అదేదిశగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కూడా సమగ్ర అభివృద్ధి సాధించడానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. పదేళ్లలో జరగని అభివృద్ధి రెండు సంవత్సరాల్లో జరిగిందని ఆయన స్పష్టం చేశారు. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నానని తెలిపారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్నివర్గాల ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి రెండూ సమానంగా అందుతున్నాయని వివరించారు. అభివృద్ధి పనులు వేగంగా జరగాలంటే స్థానిక ప్రజల సహకారం అవసరమని అన్నారు. కార్యక్రమంలో వరంగల్ మహానగరపాలక సంస్థ డీఈ సారంగం, వర్క్ ఇన్‌స్పెక్టర్ రవికుమార్, కాంగ్రెస్ నాయకులు కరాబు రాజేశ్వర్‌రావు, ఎనుకంటి నాగరాజు, తాళ్లపల్లి సుదాకర్, తాళ్లపల్లి విజయ, మండల సమ్మయ్య, జేకే పాల్గొన్నారు.
అభివృద్ధిలో వెనుకడుగు వేసేది లేదు..
హన్మకొండ చౌరస్తా: అభివృద్ధిలో ఎలాంటి వెనుకడుగు వేసేది లేదని ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. హనుమకొండ 9వ డివిజన్‌లోని కాకతీయ లైన్ ప్రాంతంలో రూ.1.30 కోట్లు, 10వ డివిజన్ పరిధిలోని అలంకార్ జంక్షన్‌లో రూ.29.50 లక్షలతో సీసీ డ్రెయిన్ నిర్మాణ పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. కార్పొరేటర్లు చీకటి శారద, తోట వెంకటేశ్వర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి
వడ్డేపల్లిలో రూ.50 లక్షలతో అభివృద్ధి పనులు ప్రారంభం


