ఎంపీ వేం నరేందర్‌ను కలిసిన డీవైఎస్‌ఓ అశోక్‌ | - | Sakshi
Sakshi News home page

ఎంపీ వేం నరేందర్‌ను కలిసిన డీవైఎస్‌ఓ అశోక్‌

Mar 16 2026 8:38 AM | Updated on Mar 16 2026 8:38 AM

ఎంపీ వేం నరేందర్‌ను కలిసిన డీవైఎస్‌ఓ అశోక్‌ ఏఓ కొత్త శ్రీప్రియకు ఇన్‌స్పైర్‌ అవార్డు ‘అద్భుత ప్రపంచంలోకి మా ప్రయాణం’ పుస్తకావిష్కరణ

వరంగల్‌ స్పోర్ట్స్‌: రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై న వేం నరేందర్‌రెడ్డిని హనుమకొండ జిల్లా యువజన, క్రీడల అధికారి గుగులోత్‌ అశోక్‌కుమార్‌ ఆదివారం హైదరాబాద్‌లో మర్యాద పూర్వకంగా కలిశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న క్రీడా పథకాలను ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో అమలయ్యేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఖిలా వరంగల్‌: వరంగల్‌ ఎరువుల నియంత్రణ ప్రయోగశాలలో అగ్రికల్చర్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న కొత్త శ్రీప్రియకు ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. విద్య, సామాజిక, మహిళా సాధికారత, నాయకత్వ ప్రతిభ, వ్యవసాయ రంగాల్లో విశేషంగా కృషిచేసిన శ్రీప్రియ.. వీహబ్‌, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా అవార్డుకు ఎంపికై ంది. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో ఇటీవల జరిగిన అవార్డుల కార్యక్రమంలో వీహబ్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ ఊహ సజ్జ, సినీ యాక్టర్‌ తన్వి చేతుల మీదుగా శ్రీప్రియ అవార్డు అందుకున్నారు. ఉమ్మడి సుస్థిర వ్యవసాయం–అధిక పంటల దిగుబడి కోసం కృషి చేస్తున్నందుకు అవార్డు దక్కడం గర్వంగా ఉందని ఆమె పేర్కొన్నారు.

హన్మకొండ కల్చరల్‌: వరంగల్‌ మిత్రమండలి సౌజన్యంతో సామాజికవేత్త రంగరాజు శ్యాంసుందర్‌ రావు రాసిన ‘అద్భుత ప్రపంచంలోకి మా ప్రయాణం’ పుస్తకావిష్కరణ ఆదివారం ఘనంగా జరిగింది. ఈ మేరకు హనుమకొండ పోస్టల్‌కాలనీలో అభయాంజనేయస్వామి దేవాలయ ఆవరణలో కవి వీఆర్‌ విద్యార్థి అధ్యక్షత జరిగిన కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్‌ అంపశయ్య నవీన్‌ పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. సాహితీవేత్తలు గన్నమరాజు గిరిజమనోహరబాబు, నాగిళ్ల రామశాస్త్రి, మల్యాల మనోహర్‌రావు, పొట్లపల్లి శ్రీనివాసరావు, వేముగంటి శుక్తిమతి, కాలనీ అధ్యక్షుడు చాడ జైహింద్‌రెడ్డి, స్థానికులు వాసిరెడ్డి కృష్ణారావు, మండవ రవీందర్‌రావు, దిలీప్‌కుమార్‌, ఏవీ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

రిటైర్డ్‌ ఉద్యోగుల బెనిఫిట్స్‌ చెల్లించాలి

హన్మకొండ: రిటైర్డ్‌ ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలు వెంటనే చెల్లించాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్‌ నాన్‌ గెజిటెడ్‌ అసోషియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కొండమల్ల రవి అన్నారు. ఆదివారం హనుమకొండ అంబేడ్కర్‌ కూడలిలోని రెవెన్యూ గెస్ట్‌ హౌస్‌లో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్‌ నాన్‌ గెజిటెడ్‌ అసోసియేషన్‌ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఇందులో కొండమల్ల రవి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్య పథకం కింద అన్ని కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో నగదు రహిత, పరిమితి లేని వైద్యం అందించాలని, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఉద్యోగ విరమణ పొందిన పెన్షనర్లకు కూడా ఎలాంటి కాంట్రిబ్యూషన్‌ ఇవ్వకుండానే ఆరోగ్య పథకం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. పీఆర్సీ అమలు చేయకపోవడంతో ఉద్యోగులు చాలా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే 40 శాతానికి తగ్గకుండా అమలు చేయాలని, ఎరియర్స్‌ వేతనంలో కలిపి ఒకేసారి చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement