అమ్మవారిని దర్శించుకున్న కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయాన్ని ఆదివారం ఉదయం హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి దంపతులు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈసందర్భంగా వారిని ఆలయ ఈఓ రామల సునీత, ప్రధానార్చకులు భద్రకాళి శేషు పూర్ణకుంభంతో, మంగళవాయిద్యాలతో ఘనంగా స్వాగతించారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు కలెక్టర్ దంపతులకు తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రాలు, మహదాశీర్వచనం అందించారు. పూజల్లో ధర్మకర్తలు ఆలయ ధర్మకర్త తొనుపునూరి వీరన్న, ఓరుగంటి పూర్ణచందర్, మూగా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ అర్బన్: వరంగల్ మహా నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపా రు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు రాత పూర్వకంగా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రజలు గ్రీవెన్స్‌ను సద్వినియోగం చేసుకోవాని ఆయన కోరారు.
వరంగల్ కలెక్టరేట్‌లో..
న్యూశాయంపేట: వరంగల్ కలెక్టరేట్‌లో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. సమస్యల పరి ష్కారం కోసం ఉదయం 10.30 నుంచి 1.30 గంటల వరకు నిర్వహించే గ్రీవెన్స్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
భీమదేవరపల్లి: ముల్కనూరు సహకార గ్రామీణ పరపతి, మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో సంఘం సభ్యుల పిల్ల లకు సంఘం అధ్యక్షుడు అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి చేతుల మీదుగా ఆదివారం నగదు అందజేశారు. బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న 90 మంది విద్యార్థులకు రూ.14,69,000, మెడిసిన్, డెంటల్, ఫార్మ్‌డీ విద్యార్థులకు రూ.21 వేల చొప్పున, ఇంజనీరింగ్, బీఫార్మసీ, బీఎస్సీ అగ్రికల్చర్, హార్టికల్చర్, నర్సింగ్ విద్యార్థులకు రూ.16 వేల చొప్పున అందజేశారు. కాగా, 2008 సంవత్సరం నుంచి ఇప్పటివరకు 1,458 మంది విద్యార్థులకు రూ1.39 కోట్లకుపైగా ఆర్థికసాయం అందించినట్లు ప్రవీణ్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో సంఘం జనరల్ మేనేజర్ రాంరెడ్డి, ఉపాధ్యక్షులు గజ్జి వీరయ్య, కార్యవర్గ సభ్యులు మూగయ్య, రవీందర్‌రెడ్డి, రాములు, కనకమ్మ, బుచ్చయ్య, బాషు, వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఐనవోలు: చంద్రగ్రహణం సందర్భంగా ఐనవోలు మల్లన్న ఆలయాన్ని మంగళవారం మూసివేస్తున్నట్లు ఆలయ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్‌గౌడ్, ఈఓ కందుల సుధాకర్, ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 8 గంటలకు ఆలయం మూసివేసి బుధవారం ఉదయం సంప్రోక్షణ అనంతరం భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు వారు పేర్కొన్నారు. భక్తులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
హన్మకొండ కల్చరల్: చంద్రగ్రహణం సందర్భంగా భద్రకాళి దేవాలయాన్ని మంగళవారం మూసివేయనున్నట్లు ఈఓ రామల సునీత, ప్రధానార్చకుడు భద్రకాళి శేషు, వేదపాఠశాల అధ్యాపకుడు తాతాభట్ల నరసింహశర్మ ఆదివా రం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 7 గంటల వరకు పూజలు నిర్వహించిన అనంతరం 7.30 గంటలకు ఆలయ ద్వారాలను మూసివేయనున్నట్లు పేర్కొన్నారు.


