ఈద్గా అభివృద్ధి పనులు పూర్తిచేయాలి
రామన్నపేట/ఖిలా వరంగల్: గ్రేటర్ వరంగల్ 11వ డివిజన్ పరిధి జెమిని థియేటర్ సమీపంలోని ఈద్గాలో చేపట్టిన అభివృద్ధి పనులను రంజాన్ పర్వదినానికి ముందే పూర్తిచేయాలని రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. వరంగల్ ఎంజీఎం సర్కిల్‌లో శిశు సంరక్షణ ప్రతిబింబించేలా రూ.35 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ప్రతిమను లాంఛనంగా ప్రారంభించారు. అదేవిధంగా మట్టెవాడ ఈద్గాలో కోటి రూపాయలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు మేయర్ గుండు సుధారాణి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు చాహత్ బాజ్‌పాయ్, సత్యశారదలో కలిసి మంత్రి సురేఖ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈద్గా అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. గడువులోగా పనులు పూర్తిచేయాలన్నారు. అదేవిధంగా 40వ డివిజన్ కరీమాబాద్‌లో రూ.1.40 కోట్ల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, ఉర్సు శ్మశానవాటిక, గౌడ సంఘం, మైనార్టీ కమ్యూనిటీ హాళ్ల పనులను కలెక్టర్ సత్యశారద, మేయర్ గుండు సుధారాణితో కలిసి మంత్రి సురేఖ శంకుస్థాపన చేశారు. కార్పొరేటర్లు మరుపల్లి రవి, పల్లం పద్మ, మీసాల ప్రకాశ్, గోపాల నవీన్‌రాజు పాల్గొన్నారు.
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ


