మెజార్టీ స్థానాలపై గురి
సాక్షి, వరంగల్: జిల్లాలో ఎన్నికలు జరుగుతున్న నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీల్లో మెజార్టీ స్థానాలతో అధికారం చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆరాటపడుతుండగా.. గతంలో మాదిరిగానే సీట్లు దక్కించుకొని అధికారం నిలుపుకోవాలని బీఆర్‌ఎస్ ప్రయత్నిస్తోంది. ఇరు పార్టీల మాదిరిగానే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో పట్టణవాసులకు కలిగే లాభాలను వివరిస్తూనే, పట్టణాల అభివృద్ధికి కేంద్రం విడుదల చేస్తున్న నిధుల వివరిస్తూ గట్టి పోటీ ఇవ్వాలనుకుంటోంది. ఇలా మూడు పార్టీలు ఎన్నికల్లో గెలిచేందుకు వ్యూహాలు రచిస్తుండడంతో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. నర్సంపేట మున్సిపాలిటీలో 30 వార్డులు, వర్ధన్నపేట మున్సిపాలిటీలో 12 వార్డులకు ఈ నెల 11న జరిగే ఎన్నికల్లో విజయం సాధించాలని ఉవ్విళూరుతున్నాయి. 2020లో జరిగిన ఎన్నికల్లో తమకు వచ్చిన స్థానాలు బేరీజు వేసుకొని ఈసారి పెరగడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై దృష్టి సారించారు. ఇప్పటికే బీఆర్‌ఎస్ పార్టీలోకి వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్, కాంగ్రెస్ మాజీ ఎంపీపీ తక్కలపెల్లి రవీందర్‌రావు, రాష్ట్ర ఖనిజాభివృద్ధి మాజీ డైరెక్టర్ నాడెం శాంతి కుమార్ చేరగా, బీఆర్‌ఎస్ మాజీ ఎంపీపీ మినుమల రాజు, బీఆర్‌ఎస్ మాజీ కౌన్సిలర్ బండి రమేష్ కుటుంబం కాంగ్రెస్‌లో చేరారు. ఇలా ముఖ్యనేతలు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటుగా వెళ్తుండడంతో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అలాగే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్‌చార్జ్‌లు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల పార్టీ ఇన్‌చార్జ్, వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జ్ రావు పద్మ పర్యటించి ఆశావహులతో భేటీ అయ్యారు. గెలుపు గుర్రాలకు బీఫామ్‌లు ఇవ్వనున్నారు. అదే సమయంలో రెబల్ అభ్యర్థులను బుజ్జగించే పనిలో నిమగ్నమయ్యారు.
గెలుపే లక్ష్యంగా..
నర్సంపేట మున్సిపాలిటీలో గతేడాది 24 వార్డులు ఉండగా, ఈ సారి ముత్తోజ్ పేట, నాగుర్లపల్లి, మాదన్నపేట, పరశనాయక్ తండా, రాములునాయక్ తండా, రాజపల్లి, ముగ్గుంపురం, మహేశ్వరం విలీనంతో ఆరు వార్డులు పెరిగి ఆ సంఖ్య 30కు చేరుకుంది. వర్ధన్నపేట మున్సిపాలిటీలో మాత్రం యథావిధిగా 12 వార్డులున్నాయి. 2020 ఎన్నికల్లో నర్సంపేట మున్సిపాలిటీలో 24 వార్డుల్లో బీఆర్‌ఎస్ 18, కాంగ్రెస్ ఆరు సీట్లు గెలుచుకుంది. వర్ధన్నపేట మున్సిపాలిటీలో 12 వార్డుల్లో 8 బీఆర్‌ఎస్, కాంగ్రెస్ 3, బీజేపీ ఒక సీటు గెలుచుకుంది. మొత్తంగా చూసుకుంటే బీఆర్‌ఎస్ 26 స్థానాలు గెలుచుకుంటే, కాంగ్రెస్ తొమ్మిది స్థానాలే గెలుచుకుంది. అయితే ఈసారి నర్సంపేటలో పెరిగిన 6 వార్డులతో కలుపుకొని రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు దక్కించుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. బీఆర్‌ఎస్ ఆ స్థానాలతో పాటు మరిన్ని గెలుచుకొని పట్టు నిలుపుకునేలా కసరత్తు చేస్తోంది. బీజేపీ ఈసారి ఒకటి నుంచి ఎక్కువ స్థానాలు గెలిచి చైర్మన్ల ఎంపికలో కీలకపాత్ర పోషించేలా నేతలు పనిచేస్తున్నారు. ఇలా అన్ని పార్టీలు ఎవరికివారుగా చాలెంజ్ తీసుకుంటుండడంతో ఎన్నికలు ఆసక్తికరంగా మారుతున్నాయి.
సీట్లు పెంచుకొని అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్
గతంలో మాదిరిగా పట్టు నిలుపుకోవాలనుకుంటున్న బీఆర్‌ఎస్
కేంద్ర పథకాలు జనాల్లోకి తీసుకెళ్లి లాభపడాలనుకుంటున్న బీజేపీ
నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీల్లో రసవత్తర రాజకీయం
మెజార్టీ స్థానాలపై గురి


