6 నామినేషన్లు ఉపసంహరణ
నర్సంపేట: నర్సంపేట మున్సిపాలిటీలో 30 వార్డులకు గాను 219 నామినేషన్లు దాఖలు కాగా ఆదివారం కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురు అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. కాగా 19వ వార్డు బీసీ జనరల్, 20వ వార్డు జనరల్ మహిళకు రిజర్వేషన్ కాగా అత్యధికంగా 12 నామినేషన్లు, 27వ వార్డు బీసీ మహిళ రిజర్వేషన్ కాగా అత్యల్పంగా 4 నామినేషన్లు వేశారు.
ఇన్‌చార్జ్ ఈఓగా ప్రసాద్
గీసుకొండ: మండలంలోని కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి ఆలయ ఇన్‌చార్జ్ ఈఓగా వరంగల్ నగరంలోని దుర్గేశ్వరస్వామి, ఉర్సులోని నాగేంద్రస్వామి ఆలయాల ఇన్‌చార్జ్ ఈఓగా విధులు నిర్వహిస్తున్న పి.ప్రసాద్ నియమితులైయ్యారు. కొమ్మాల ఆలయ ఈఓగా ఉన్న అద్దంకి నాగేశ్వర్‌రావును బాధ్యతల నుంచి తప్పిస్తూ దేవాదాయశాఖ కమిషనర్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆలయ ఆదాయ, వ్యయాలకు సంబంధించిన విషయంలో పలు ఆరోపణలు రావడంతో ఈ మార్పులు జరిగినట్లు తెలుస్తోంది.
అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ కృషి అమోఘం
● జైపూర్‌లోని ఎంఎన్‌ఐటీ ప్రొఫెసర్ కవిత
కేయూ క్యాంపస్: అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ కృషి అమోఘం అని జైపూర్‌లోని ఎంఎన్‌ఐటీ ప్రొఫెసర్ డాక్టర్ కవిత లాల్వాని అన్నారు. ఆదివారం కేయూ ఫిజిక్స్ విభాగం, స్టూడెంట్స్ అఫైర్స్ డీన్ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో లెగసీ ఆఫ్ కల్పనా చావ్లాపై నిర్వహించిన ఆన్‌లైన్ వెబినార్‌లో పాల్గొని ఆమె కీలకపోన్యాసం చేశారు. డాక్టర్ కల్పనా చావ్లా జీవితం భౌతిక శాస్త్రం, అంతరిక్ష పరిశోధన, మహిళా శాస్త్రవేత్తల ప్రేరణకు ప్రతీకగా నిలిచాయని కవిత అన్నారు. కల్పనా చావ్లా నాసాలో చేసిన కృషి, శాసీ్త్రయ ఆవిష్కరణలపై ఆమె చూపిన ఆసక్తి విద్యార్థులకు ఎంతో ప్రేరణ కలిగించిందని అభిప్రాయపడ్డారు. అంతరిక్షంలో భౌతికశాస్త్రం ప్రయోగాల ప్రాముఖ్యత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎన్‌ఎస్) భారతీయ గగన్ యాన్ మిషన్‌లో రేడియేషన్ భద్రత వంటి అంశాలను ఈసందర్భంగా శాసీ్త్రయంగా విశ్లేశించారు. కార్యక్రమంలో కేయూ ఫిజిక్స్ విభాగాధిపతి డాక్టర్ మంజుల, ప్రొఫెసర్లు బి.వెంకట్రామ్‌రెడ్డి, స్టూడెంట్స్ అఫైర్స్ డీన్ మామిడాల ఇస్తారి, అసిస్టెంట్ ప్రొఫెసర్లు పద్మజ, ఏవీ రావు, యూత్ వెల్ఫేర్ ఆఫీసర్ రాధిక పాల్గొన్నారు.
టెన్త్ విద్యార్థులకు
టీ శాట్ పాఠాలు
విద్యారణ్యపురి: టెన్త్ విద్యార్థులకు టీ శాట్ ద్వారా ప్రత్యేక పాఠాలను ప్రసారం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర విద్య, పరిశోధన శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ ) అధికారులు నిర్ణయించారు. ఈనెల మూడున భౌతికశాస్త్రం, జీవశాస్త్రం, హిందీ, ఆంగ్లం, నాలుగున మ్యాథ్స్, సాంఘికశాస్త్రం, తెలుగు, ఉర్దూ, ఐదున ఉర్దూ మాధ్యమంలో మ్యాథ్స్, ఫిజిక్స్, జీవశాస్త్రం, సాంఘిక శాస్త్రాలపై పాఠాలు ప్రసారం కానున్నాయి. విద్యార్థులు టీ శాట్ ప్రసారాల పాఠాలు వినియోగించుకునేలా హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు కృషి చేయాలి. ఎంఈఓలు పర్యవేక్షించాలి. హనుమకొండ జిల్లాలో 12,078 మంది అన్ని యాజమాన్యాల పాఠశాలల విద్యార్థులు మార్చి 14 నుంచి వార్షిక పరీక్షలు రాయనున్నారు.
భక్తుల కోలాహలం
మంగపేట/వెంకటాపురం(ఎం): మేడారంలోని వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించిన అనంతరం హేమాచలక్షేత్రం, రామప్ప ఆలయానికి తరలివచ్చి లక్ష్మీనర్సింహస్వామి, రామలింగేశ్వస్వామిని దర్శించుకుంటున్నారు. ఈ మేరకు ఆదివారం మంగపేట మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో కోలాహలంగా మారింది. సు దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి ఆలయంలోని స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పవన్‌కుమార్, శేఖర్‌శర్మ భక్తుల గోత్ర నామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించి స్వామివారి చరిత్ర, ఆలయ పురాణం వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. మేడారం భక్తులు తిరుగు ప్రయాణంలో రామప్పను సందర్శిస్తుండడంతో పాటు ఆదివారం సెలవు కావడంతో అధికసంఖ్యలో తరలివచ్చారు.


