
బాలలపై లైంగిక దోపిడీని నిర్మూలించాలి
హన్మకొండ: బాలలపై లైంగిక దోపిడీని సమర్థవంతంగా నిర్మూలించాలని అడిషనల్ డీసీపీ ఎన్.రవి అన్నారు. హనుమకొండ సుబేదారిలోని అసుంత భవన్‌లో చిల్డ్రన్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ బెంగళూరు, ఎఫ్‌ఎంఎం సాంఘిక సేవా సంస్థ సంయుక్తంగా రాష్ట్రంలోని ఎంపిక చేసిన స్వచ్ఛంద సంస్థలకు ఆన్‌లైన్‌లో ‘బాలల లైంగిక దోపిడీని నిర్మూలించడంలో స్వచ్ఛంద సంస్థల పాత్ర’ అనే అంశంపై రెండు రోజుల పాటు జరిగే రాష్ట్ర స్థాయి వర్క్‌షాపు సోమవారం ప్రారంభమైంది. ఎన్.రవి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ సైబర్ నేరాలపై అవగాహన లేకపోవడంతో బాలలు అత్యధికంగా లైంగిక దోపిడీకి గురవుతున్నారన్నారు. దీనిపై ప్రభుత్వం, పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు సమర్థవంతంగా పనిచేయాలన్నారు. సైబర్ క్రైమ్ ఏసీపీ గిరి కుమార్ మాట్లాడుతూ సైబర్ నేరాలపై పిల్లలు, పెద్దలను అప్రమత్తం చేసి అవగాహన కల్పించాలన్నారు. ఎఫ్‌ఎంఎం సాంఘిక సేవా సంస్థ డైరక్టర్ సిస్టర్ సహాయ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో చిల్ట్రన్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ ప్రోగ్రాం మేనేజర్ శుభ్రత్, హనుమకొండ, మహబూబాబాద్ జిల్లాల సీడబ్ల్యూసీ చైర్మన్, చైర్‌పర్సన్ అనిల్ చందర్ రావు, కె.నాగమణి, ఎఫ్‌ఎం శ్రామిక వికాస కేంద్రం డైరక్టర్ లక్ష్మణ్ రావు, స్కాపర్డ్ డైరెక్టర్ ప్రసాద్, ఎఫ్‌ఎంఎం సాంఘిక సేవా సంస్థ ప్రాజెక్టు కో ఆర్డినేటర్లు బత్తుల కరుణ, తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ పోలీస్ కమిషనరేట్
అడిషనల్ డీసీపీ రవి