
నోటిఫికేషనే తరువాయి..
ఉమ్మడి వరంగల్‌లో ఇలా..
సాక్షిప్రతినిధి, వరంగల్ :
స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి వేళయ్యిందా? రిజర్వేషన్లు తేలకున్నా.. ఎన్నికలు నిర్వహించేందుకు సర్కారు సిద్ధమవుతోందా? ఈ మేరకు పార్టీ కేడర్, నాయకులకు సంకేతాలు అందాయా? పీఏసీలో తీసుకున్న నిర్ణయం మేరకు సెప్టెంబర్ మొదటి వారంలో నోటిఫికేషన్ వెలువడనుందా? ఉన్నతాధికారులను అప్రమత్తం చేశారా?... అంటే నిజమే అంటున్నాయి కాంగ్రెస్ పార్టీ, అధికార వర్గాలు. నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడినా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని సోమవారం కూడా జిల్లా కలెక్టర్లకు మౌఖిక ఆదేశాలు అందాయన్న ప్రచారం జరుగుతోంది.
రాజకీయ పార్టీల్లో మొదలైన సందడి..
ఎన్నికల నిర్వహణ కోసం అధికార యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. మొదట పేర్కొన్న విధంగానే ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జెడ్పీపీపీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సెప్టెంబర్‌లో నో టిఫికేషన్ వస్తే ఉమ్మడి వరంగల్‌లోని ఆరు జిల్లాల్లో ఆరు జిల్లా ప్రజాపరిషత్‌లు, 75 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. 778 ఎంపీటీసీ స్థానాలు 75 ఎంపీపీ స్థానాలను ప్రకటించి పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు. ఆతర్వాత 1,708 గ్రామ పంచాయతీలు, 15,006 వార్డులకు ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా ఎన్నికలు జరిపేలా 15,021 పోలింగ్ కేంద్రాలను కూడా సిద్ధం చేసినట్లు అధికారులు ఇది వరకే ప్రకటించారు. కాగా, ఈ నెల 29న జరిగే తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ ఇటీవలి సమావేశంలో జరిగే కీలక నిర్ణయాలను బట్టి ‘స్థానిక’ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉండగా.. రాజకీయ పార్టీల్లోనూ స్థానిక సంస్థల ఎన్నికల సందడి పెరిగింది. సెప్టెంబర్ మాసంలో ఎన్నికలు ఖాయమన్న ప్రచారం నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీల టికెట్లపై పోటీ చేసేందుకు ఆశావహులు సై అంటున్నారు. ఆయా పార్టీలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎంపీలు, ఆయా పార్టీల జిల్లా అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలను కలిసి తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.
సెప్టెంబర్‌లోనే నోటిఫికేషన్?
ఆ దిశగానే కసరత్తు..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు గడువు ముగిసి దాదాపుగా రెండేళ్లు కావస్తోంది. దీనిపై ఇదివరకే ఈ సెప్టెంబర్ నెలాఖరులోగా ఎన్నికలు జరిపించాలన్న హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ఇటీవల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అధికార పార్టీ నేతలు, సీఎం నిర్ణయించినట్లు ప్రచారం. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అంశం ఎటూ తేలకపోయినప్పటికీ.. పార్టీ పరంగా ఆ మేరకు అవకాశం కల్పించే యోచనలో అధిష్టానం ఉన్నట్టు ఆ పార్టీ ఉమ్మడి జిల్లా శాసనసభ్యులు చెబుతున్నారు. ఈనెల 29న జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ కీలక నిర్ణయాలపై చర్చించి ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఎప్పుడు నోటిఫికేషన్ వెలువడినా.. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్లకు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్, చీఫ్ సెక్రటరీల నుంచి ఆదేశాలు అందడంతో అందరూ అలర్ట్ అయ్యారు.
జిల్లా జెడ్పీపీపీ జెడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచ్ వార్డులు పోలింగ్ కేంద్రాలు
హనుమకొండ 1 12 12 129 210 1,986 1,986
వరంగల్ 1 11 11 130 317 2,754 2,754
జేఎస్‌భూపాలపల్లి 1 12 12 109 248 2,102 2,102
మహబూబాబాద్ 1 18 18 193 482 4,110 4,110
ములుగు 1 10 10 83 171 1,520 1,535
జనగామ 1 12 12 134 280 2,534 2,534
06 75 75 778 1,708 15,006 15,021
స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధం
సెప్టెంబర్ మొదటి వారంలో
ప్రకటించే అవకాశం
‘స్థానిక’ంలో బీసీలకు 42 శాతం
అవకాశం.. పార్టీ కేడర్‌కు
కాంగ్రెస్ సంకేతాలు
ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ..
ఆ తర్వాతే సర్పంచ్, ‘ఫ్యాక్స్’ల ఎన్నికలు
ఉమ్మడి జిల్లాలో 6 జెడ్పీలు,
75 జెడ్పీటీసీ స్థానాలు..
జిల్లా కలెక్టర్లకూ సీఎస్ సమాచారం