
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
● అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి
ఎల్కతుర్తి: భీమదేవరపల్లి మండలంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం, తహసీల్దార్ కార్యాలయం, ముల్కనూరులోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం అడిషనల్ కలెక్టర్ వెంకట్‌రెడ్డి ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ముందుగా తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి పలు రికార్డులు పరిశీలించారు. అనంతరం కస్తూర్బాగాంధీ విద్యాలయాన్ని సందర్శించారు. విద్యాలయంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించారు. కూరల్లో నీళ్లు ఎక్కువగా ఉన్నాయని, ఫుడ్ పాయిజన్ కాకుండా నాణ్యమైన భోజనాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలని ఎస్‌ఓ జ్యోతికి సూచించారు. అనంతరం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. ఔషధ నిల్వలు, ఫీవర్ సర్వే, సుఖ ప్రసవాలు, తదితర అంశాల నమోదు తీరును డాక్టర్ ప్రదీప్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు.
ఉనికచర్లలో ఇసుక బజార్ ఏర్పాటు
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ లబ్ధిదారుల కోసం మూడు రోజుల క్రితం ధర్మసాగర్ మండలం ఉనికిచెర్ల గ్రామంలో ఇసుక బజార్‌ను ప్రారంభించినట్లు వెంకట్‌రెడ్డి తెలిపారు. ఈ ఇసుక బజార్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. టన్నుకు ఇసుక రూ.వెయ్యి ఉంటుందని, రవాణా ఖర్చులు అదనంగా చెల్లించాలన్నారు. త్వరలో భూ భారతి దరఖాస్తులను పరిశీలిస్తామని, వారసత్వం, మ్యుటేషన్, మిస్సింగ్, సర్వేనంబర్ల దరఖాస్తులను దశలవారీగా పరిశీలించి సర్వే అనంతరం పరిష్కరిస్తామన్నారు. ఆయన వెంట తహసీల్దార్ రాజేశ్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్, విజయ్‌భాస్కర్ తదితరులు ఉన్నారు.
యోగా ఇన్‌స్పెక్టర్‌కు మెమో జారీ చేయండి
విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న భీమదేవరపల్లి మండలం ముల్కనూరు ప్రభుత్వ హోమియోపతి వైద్యశాల యోగా ఇన్‌స్పెక్టర్‌కు మెమో జారీ చేయాలని అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి.. ఆ వైద్యశాల డాక్టర్ సరితకు ఆదేశాలు జారీ చేశారు. హోమియోపతి వైద్యశాలను ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యశాలలో యోగా ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న సురేశ్ కొద్ది రోజులుగా విధులకు గైర్హాజరు అవుతున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో వైద్యాధికారి డాక్టర్ సరితను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అతడి తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని, మెమో జారీ చేయాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రజలు శారీరక రుగ్మతల బారిన పడకుండా హోమియో వైద్యశాలల్లో హెల్త్ వెల్‌నెస్ సెంటర్లను ఏర్పాటు చేసి యోగా శిక్షణ అందిస్తున్నామన్నారు. విధుల్లో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ హెచ్చరించారు.

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి