
కుట్టు శిక్షణలో మెళకువలు నేర్చుకోవాలి
కలెక్టర్ స్నేహ శబరీష్
ఆత్మకూరు/దామెర: మహిళలు కుట్టు శిక్షణలో మెళకువలు నేర్చుకోవాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ పిలుపునిచ్చారు. ఆత్మకూరు, దామెర మండల కేంద్రాల్లో బుధవారం కలెక్టర్ స్నేహ శబరీష్ మహిళా కుట్టు శిక్షణ కేంద్రాల్ని సందర్శించారు. శిక్షణ పొందుతున్న మహిళలతో మాట్లాడి పలు సూచనలిచ్చారు. మండల మహిళా సమాఖ్య అధ్వర్యంలో నిర్వహిస్తున్న కుట్టు నైపుణ్య శిక్షణ అభివృద్ధి కేంద్రాన్ని మహిళలు వినియోగించుకోవాలని, కుట్టుకు సంబంధించిన మెలకువలను శిక్షణ కాలంలో నేర్చుకోవాలన్నారు. సందర్భంగా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. టెక్స్‌టైల్ పార్కులో ఉపాధి అవకాశం వచ్చినా, రాకున్నా స్వయం ఉపాధి ద్వారా సొంత కాళ్ల పై నిలబడే అవకాశం లభిస్తుందన్నారు. అనంతరం ఆత్మకూరు మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పరిశీలించారు. అనంతరం దామెర సమాఖ్య భవనం ఆవరణలో మొక్క నాటారు. ఆయా కార్యక్రమాల్లో డీఆర్డీఓ మేన శ్రీను, సెర్ప్ అడిషనల్ డీఆర్డీఓ వెంకటేశ్వర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.