
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ఖానాపురం: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన మండల కేంద్రం శివారులో మంగళవార రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మనుబోతులగడ్డ గ్రామానికి చెందిన దున్నపోతుల సంజీవ కుమారుడు వ్యాసు (21) నర్సంపేటలోని జయముఖి కళాశాలలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. వ్యక్తిగత పనుల నిమిత్తం ద్విచక్ర వాహనంపై నర్సంపేటకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలో ఖానాపురం శివారులోని బ్రిడ్జిపైకి రాగానే నర్సంపేట నుంచి ఖానాపురం వైపు వస్తున్న ట్రాక్టర్‌ను ఢీకొని పడిపోయాడు. ప్రమాదంలో తీవ్రగాయాలై అక్కడికక్కడికే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్సై రఘుపతి సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వ్యాసు మృతితో కుటుంబంతో పాటు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.