
కొత్త కార్డులకు బియ్యం
జిల్లాలో రేషన్‌కార్డులు,
దుకాణాలు, బియ్యం వివరాలు..
ఖిలా వరంగల్: రేషన్‌కార్డుల కోసం 11 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న పేదల కల నెరవేరింది. జూలై 14న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొత్త రేషన్‌కార్డుల పంపిణీ ప్రారంభించిన విషయం తెలిసిందే. జిల్లాలో లబ్ధిదారులకు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా రేషన్‌కార్డులు అందించారు. దీంతో వారి మోముల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆదేశాల మేరకు కొత్త కార్డుదారులకు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి రేషన్ బియ్యం పంపిణీకి అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. జూన్‌లో మూడు నెలల రేషన్ బియ్యం లబ్ధిదారులకు ఒకేసారి పంపిణీ చేసింది. దీంతోపాటు మూడు నెలలుగా ప్రభుత్వం కొత్త రేషన్‌కార్డుల జారీతోపాటు ఉన్న కార్డుల్లో సభ్యుల పేర్లను నమోదు చేసింది. జిల్లాలో పెరిగిన ఆహారభద్రతా కార్డుల్లోని సభ్యుల సంఖ్యకు అనుగుణంగా సన్నబియ్యం పంపిణీ చేసేందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి
రేషన్‌షాపులకు బియ్యం..
కొత్త రేషన్‌కార్డుదారులకు బియ్యం పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి యథావిధిగా పాత కార్డులతోపాటు కొత్త కార్డులకు సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే జిల్లాకు సెప్టెంబర్ నెల కోటాకు సంబంధించిన సన్న బియ్యం కేటాయించింది. ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి రేషన్‌షాపులకు బియ్యం తరలింపునకు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం చౌకధరల దుకాణాలు, మండలస్థాయి గోదాముల్లో నిల్వ ఉన్న బియ్యానికి తోడు అదనంగా కావాల్సిన బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. కొత్తకార్డుల పంపిణీకి ముందు ప్రతి నెల సుమారు 509 షాపుల ద్వారా 2,66,429 కార్డులకు 50,14,541 మెట్రిక్ టన్నులు బియ్యాన్ని పంపిణీ చేశారు. పెరిగిన లబ్ధిదారుల సంఖ్యకు అనుగుణంగా అదనంగా జిల్లాకు 53,82,518 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కేటాయించినట్లు అధికారులు తెలిపారు.
జిల్లాలో మూడు ఎంఎల్‌ఎస్ పాయింట్లు..
వరంగల్ జిల్లాలో ఏనుమాముల, వర్ధన్నపేట, నర్సంపేట ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి 13 మండలాల్లోని 509 రేషన్ షాపులకు బియ్యం చేరనున్నాయి. స్టేజ్–1 గోదాముల నుంచి ఇప్పటికే ఎంఎల్‌ఎస్ పాయింట్లకు సన్న బియ్యం నిల్వలు రాక ప్రారంభమైంది. ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి నేరుగా రేషన్ షాపులకు సన్నబియ్యం పంపేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు.
సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి పంపిణీకి సన్నాహాలు
ఏర్పాట్లు చేస్తున్న పౌరసరఫరాల శాఖ
పెరిగిన లబ్ధిదారుల సంఖ్యకు
అనుగుణంగా రేషన్ దుకాణాలకు
కోటా కేటాయింపు
రేషన్ దుకాణాలు : 509
పాతకార్డులు : 2,66,429
కొత్తకార్డులు : 16,251
ఎంఎల్‌ఎస్ పాయింట్లు : ఏనుమాముల,
నర్సంపేట, వర్ధన్నపేట
పంపిణీ చేయాల్సిన బియ్యం :
5,382,518 మెట్రిక్ టన్నులు