
పరకాల పోలీస్‌స్టేషన్‌లో ఒకరి ఆత్మహత్యాయత్నం
● దాడి ఘటనలో ఫిర్యాదుతో మనస్తాపం
పరకాల: హనుమకొండ జిల్లా పరకాల పోలీస్‌స్టేషన్‌లో ఓ వ్యక్తి సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. నడికూడ మండలానికి చెందిన యువకుడు తాళ్ల స్వామిరాజ్‌తోపాటు మరో ముగ్గురు తనపై హత్యాయత్నం చేశారంటూ అదే గ్రామానికి చెందిన కిన్నెర మల్లికార్జున్ అనే వ్యక్తి పరకాల పోలీస్ స్టేషన్‌లో సోమవారం ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుపై పరకాల పోలీసులు స్వామిరాజ్‌ను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. తనపై కావాలనే కుట్ర పూరితమైన కేసు పెట్టారనే మనస్తాపంతో స్వామిరాజ్ తన వెంట తెచ్చుకున్న క్రిమిసంహారక మందును స్టేషన్‌లోనే తాగాడు. పోలీసులు, ఆయన వెంట వచ్చిన వ్యక్తులు వెంటనే చికిత్స నిమిత్తం పరకాల సివిల్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సీఐ క్రాంతికుమార్ మాట్లాడుతూ.. కిన్నెర మల్లికార్జున్ ఇంట్లో తాళ్ల అనిల్‌కుమార్ అద్దెకు ఉంటున్నాడని తెలిపారు. అనిల్‌కుమార్‌కు, అదే గ్రామానికి చెందిన స్వామిరాజ్‌కు పాత తగాదాలు ఉండడంతో పొలం పనికి వెళ్లివస్తున్న మల్లికార్జున్‌ను స్వా మిరాజ్ అసభ్య పదజాలంతో దూషించడమే కా కుండా దాడి చేసినట్లు ఫిర్యాదు వచ్చిందన్నారు. స్వామిరాజ్‌ను స్టేషన్‌కు పిలిపించామని, తాము ఎలాంటి ఇబ్బందీ పెట్టలేదని స్పష్టం చేశారు.