
ట్రాక్టర్ నుంచి బస్తాలు దింపుతూ..
సంగెం: ట్రాక్టర్ నుంచి ధాన్యం బస్తాలు దింపుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు జారీ కిందపడి ఓ హమాలీ తీవ్రగాయాలతో చికిత్స పొందుతూ మృతిచెందాడు. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని గవిచర్ల గ్రామానికి చెందిన వేల్పుల ఎలిషా, నర్సయ్య దంపతులకు కుమారుడు రాజు(26), ఒక కూతురు ఉన్నారు. కూతురు వివాహం కాగా రాజుకు వివాహం కాలేదు. తండ్రి నర్సయ్య పక్షవాతంతో మంచానపడ్డాడు. తల్లి కూలికి, రాజు హమాలీ పనికి వెళ్లేవాడు. రోజువారీ పనిలో భాగంగా రాజు ఈ నెల 15న ఆశాలపల్లిలోని కేదారేశ్వర రైస్ మిల్లులో హమాలీ పనికివెళ్లాడు. ధాన్యం బస్తాలు ట్రాక్టర్ నుంచి దింపుతున్న క్రమంలో అదుపుతప్పి కిండపడిపోగా మర్మాంగాలకు, కాళ్లు, చేతులకు తీవ్రగాయాలయ్యాయి. ఇంటికి వెళ్లి ఆర్‌ఎంపీతో ఇంజక్షన్ వేయించుకున్నాడు. శనివారం ఉదయం వరకు రాజు తీవ్ర అస్వస్థతకు గురికాగా ఎంజీఎం తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మృతిచెందాడు. కాగా ఈ విషయం గురించి ఎస్సై నరేశ్‌ను వివరణ కోరగా రాజు మృతిచెందింది వాస్తవమేనని, ఫిర్యాదు అందలేదన్నారు.
జారిపడి హమాలీకి తీవ్రగాయాలు
చికిత్స పొందుతూ మృతి